Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో యాసంగిలో 2లక్షలా 40వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు 4 లక్షలా 80 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలోని 17 మండలాల్లో 292 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. వర్షాలు పడుతుండడంతో ధాన్యం తడిసిపోతున్నది. కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని డిమాండ్ చేస్తూ దీంతో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. భూదాన్ పోచంపల్లి, బీబీ నగర్, భువనగిరి మోత్కూర్, ఆలేర్ లో రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి పోకుండా రైతులు సొంతంగా పట్టాలను అద్దెకు తీసుకొచ్చుకుంటున్నారు. కొనుగోలు ఆలస్యం కావడంతో ఒక్కో పట్టాకు రోజుకు రూ.30-40 చొప్పున ధాన్యం అమ్మేసరికి వేల రూపాయలు అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 200 నుంచి 500 వరకు సీరియల్ నెంబర్ నడుస్తోంది. ప్రతిరోజు 10 నుండి 20 నెంబర్లు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొందరు కర్నూలు ధాన్యాంను క్వింటాకు రూ. 1300 నుండి 1400 వరకు కొనుగోలు చేస్తూ నేరుగా రైస్ మిల్లర్లకు పంపిస్తున్నారు .
ఎగుమతులకు లారీల కొరత
ధాన్యం ఎగుమతి చేయడానికి లారీల కొరత ఉందని అధికారులు చెబుతున్నా అది సరైన సమాధానం కాదు అని రైతులు వాపోతున్నారు. ధాన్యం ఎగుమతి చేయడానికి లారీలు యజమానులు ముందుకు వస్తున్నా సరైన సమయంలో అధికారులు డబ్బులు చెల్లించకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు. ప్రైవేటు కొనుగోలుదారులకు లారీలు పెద్ద ఎత్తున దొరుకుతూ ఉంటే ప్రభుత్వానికి లారీలు దొరకకపోవడం విడ్డూరంగా ఉంది. క్వింటాకు 3 కిలోల నుండి 6 కిలోల వరకు బరువు తీస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికార ఎమ్మెల్యేలు
ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతోపాటు తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పట్టించు కోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో వారు గుంపులుగా ఉండడంతో అనారోగ్యం పాలు కావాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైస్ మిల్లర్లతో, లారీ యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి : సీపీఐ(ఎం)
ధాన్యం వెంటనే కొనుగోలు చేసి త్వరితగతిన ఎగుమతి, దిగుమతి చేయడానికి ప్రభుత్వ అధికారులు రైెస్మిల్లు యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా తగు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. ఎగుమతులు కావడం లేదని ఒక వైపు సెలవులు ప్రకటిస్తూ ఆ సెలవు దినాల్లో కూడా కొనుగోలు చేస్తున్నట్టు తమ దష్టికి వచ్చినట్టు తెలిపారు. ఇందులో మిల్లర్లు ప్రైవేటు యజమానులు ఐకేపీ కేంద్రాల్లో అధికారులు కొందరు ములాఖాత్ అయ్యి వారు రైతులను నష్టపరుస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రైసు మిల్లర్లు ఇతర జిల్లాల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా స్థానిక రైతుల వద్ద నుండి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.