Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కమిటీల సంతాపం
నవతెలంగాణ - మునుగోడు
మండలంలోని కల్వకుంట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బొందు నర్సింహా (66) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఈక్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఇంటి వద్దే మృతి చెందారు. నర్సింహా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. అంతకు ముందు ఆయన మృతదేహాన్ని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం తదితరులు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుంట గ్రామంలో నర్సింహా వరుసగా రెండుసార్లు సర్పంచిగా గెలుపొంది గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేశారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి తుది శ్వాస విడిచే వరకూ ఎర్రజెండా పక్షాన నిలిచిన నాయకుడు నర్సింహా అని కొనియాడారు. ఆయన అకాల మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో వెల్మకన్నె ఎంపీటీసీ చాపల మారయ్య, మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, కల్వకుంట్ల సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య, పార్టీ కల్వకుంట్ల గ్రామ కార్యదర్శి నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, వడ్లమూడి హనుమయ్య, పర్సనగోని యాదగిరి, వరికుప్పల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
బొందు నర్సింహా మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యం అన్నారు. శుక్రవారం ఆయన నర్సింహా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీఐ(ఎం)లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా పని చేసి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి శ్రీ చలపతి, రామచంద్రం, టి.వెంకటేశ్వర్లు,మ లాలు, చాపల శ్రీను, కోరుకొండ లింగయ్య, నర్సింహా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.