Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు
- శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
నవతెలంగాణ - నల్లగొండ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిదని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనులు, ఎన్నో వనరులు, మరెంతో చారిత్రక సంపద మన వారసత్వమన్నారు. స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి 14 ఏండ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యూలు కావాలని, అప్పుడే మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ సుసాధ్యం చేసుకోగలమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా, గోదావరి జలాలను సమర్ధవంతంగా వినియోగించుకొని కోటి ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలోని రూపు రేఖలు మారిపోతున్నాయని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా నిర్మాణమైన ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర సృస్టించిందని చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీడు భూములను సస్య శ్యామలం చేయడానికి కాళేశ్వరం జలాలతో పాటు నల్లగొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బీసీ సొరంగం పనులు, బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతు బంధు, మరణించిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న రైతుబీమా పథకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అత్యధికంగా 7.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకకరించి రాష్ట్రంలోనే కాక దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2021-22 వానాకాలంలో 7.20 లక్షల ఎకరాల్లో పత్తి, సన్న బియ్యం రకాలను సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని వివరించారు. భవిష్యత్‌లో విద్యుత్ కొరత రాకూడదని జిల్లాలోని దామరచర్లలో ''యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టు'' నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అతి త్వరలోనే ఈ మెగా పవర్ ప్రాజెక్టు ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఐజీ ఏవీ రంగనాథ్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, రాహూల్శర్మ, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మెన్ పెద్దులు, పెద్దవూర జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.