Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి,కంది లతో అధిక లాభాలు
- మంత్రి జగదీశ్‌రెడ్డి
- వానాకాలం పంటలపై ప్రత్యేక సమీక్షా సమావేశం
నవతెలంగాణ -నల్గొండ
డిమాండ్ ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా యావత్ రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోవొచ్చని ఆయన పేర్కొన్నారు. వానాకాలం పంటలపై బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలంలో జిల్లాలో 12 లక్షలా 18 వేలా 710 ఎకరాలు సాగులోకి రానున్నట్లు గుర్తించినట్టు అధికారులు మంత్రి దష్టికి తీసుకువచ్చారు. 2020 వానాకాలంతో పోల్చి చూసినట్టయితే 63,730 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వచ్చినట్టు అధికారులు మంత్రికి వివరించారు. అందుకు సంబంధించి రూపొందించిన ప్రణాళిక వివరాలు అందించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ వానాకాలంలో వరిని తగ్గించే విధంగా వ్యవసాయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.2020లో జిల్లాలో 401124 ఏకరాలలో వరి పండించగా ఈ వానాకాలం నాటికి దానిని 353800 ఎకరాలకు కుదించారు.అంటే మొత్తం మీద 47 వేల 324 ఎకరాలను తగ్గించారు.దీనిని గమనించిన మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికి అధికారులు చొరవ చూపాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో పత్తి,కందులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. జొన్నలు, పెసర్లు, మినుములు,పొద్దు తిరుగుడుతో పాటు ఆముదం, మొక్కజొన్న తదితర పంటలకున్న డిమాండ్‌ను రైతులకు వివరించ గలిగితే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతు దృష్టి మరల్తుందని ఆయన చెప్పారు.ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్,స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.