Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరియమ్మ లాకప్ డెత్ కు కారకులైన పోలీసులను అరెస్ట్ చేయాలని డిమాండ్
- అడ్డగూడూర్ను అష్టదిగ్బంధనం చేసిన పోలీస్ బలగాలు
- 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు
నవతెలంగాణ-మోత్కూర్
అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో మరియమ్మ లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ దళిత బహుజన విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో అడ్డగూడూర్ కు పిలుపునివ్వడంతో హైటెన్షన్‌కు దారితీసింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి నిరసన వ్యక్తం చేస్తారన్న సమాచారంతో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. రాచకొండ క్రైమ్ డీసీపీ యాదగిరి, యాదాద్రి భువనగిరి అడిషనల్ డీసీపీ భుజంగరావు, చౌటుప్పల్ ఏసీపీ శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం స్పెషల్ పార్టీ, ఏఆర్, ఎస్వోటీ ఫోర్స్ 200 మంది పోలీసులతో అడ్డగూడూరు మండలాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లోని రూట్లలో 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అడ్డగూడూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే దారులన్నింటిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మోత్కూర్ మండలం పాటిమట్ల ఎక్స్ రోడ్డులో సుమారు వంద మంది పోలీసులు మోహరించి, భారీ కేడ్లు ఏర్పాటు చేసి వజ్ర వాహనం, సీసీ కెమెరాలతో ఆ రూట్లలో వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పంపించారు. మరియమ్మ లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసు అధికారులను వెంటనే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని, పోలీసులపై ఎస్సీి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జ్యూడిషియల్ విచారణ జరిపి చట్టపరంగా శిక్షించాలన్న డిమాండ్లతో వాల్ పోస్టర్లు విడుదల చేసి ఛలో అడ్డగూడూర్ కు ఓయూ దళిత విద్యార్థి, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కాగా మరియమ్మ లాకప్ డెత్ పై జుడిషియల్ విచారణ జరుగుతుందని, మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవడంతో పాటు కుమారుడికి ఉద్యోగం ఇచ్చిందని, లాకప్ డెత్ కు కారకులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని, ఇలాంటి సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ దళిత విద్యార్థి, ప్రజా సంఘాలు చలో అడ్డగూడూరు పిలుపునివ్వడం సరైంది కాదని, ఉద్రిక్తతలకు దారితీసి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు నిర్వహించింది. అడుగడుగునా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించడంతో ఓయూ దళిత విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు అడ్డగూడూరుకు రాలేకపోయారు. ఎలాంటి ఉద్రిక్తతలకు అవాంఛనీయ సంఘటనలకు దారితీయకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బందోబస్తు నిర్వహించి పోలీస్ బలగాలు వెనుదిరిగాయి. పోలీస్ బందోబస్తులో రామన్నపేట, చౌటుప్పల్, చౌటుప్పల్ రూరల్ సీఐలు రాజు, ఎం. శ్రీనివాస్, వెంకటయ్య, మోత్కూర్ ఎస్ఐ జి.ఉదరు కిరణ్ తో పాటు 200 మంది పోలీసులు పాల్గొన్నారు.-