Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 టీఎంసీ నీళ్ల కోసం రూ.లక్షా 18 వేల కోట్లు ఖర్చు
- వృథాగా పోతున్న 11 టీఎంసీల గురించి పట్టించుకోరు..
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ - కోదాడరూరల్
రాష్ట్రంలోని రైతులకు అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని టీపీసీసీ మాజీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, సంఘమేశ్వేర ప్రాజెక్టులు పూర్తైతే 7 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతున్నదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండి పోతుందో అర్ధం కాని విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ తెలంగాణ ప్రజానీకాన్ని తాకట్టు పెట్టి రూ.లక్షల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి కేవలం మూడు టీఎంసీల నీళ్ల కోసం రూ.లక్షా 18 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఆ ప్రాజెక్టు కరెంటు నిర్వహణ ఖర్చులకే రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, శ్రీశైలం గ్రావెల్ నుంచి ఉచితంగా వచ్చే 11 టీఎంసీల నీటిని పోగొట్టుకొని మూడు టీఎంసీల నీరు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని వివరించారు. కృష్ణా నదిని డైవర్ట్ చేసి నీరు తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 8 శాతం కమీషన్ల కోసం అడ్డగోలుగా రూ.లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వమంతా కలసి కట్టుగా పని చేసి పార్టీని 2023లో అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ నారాయణరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పార సీతయ్య, పట్టణాధ్యక్షులు వంగవీటి రామారావు, చింతలపాటి శ్రీనివాస్‌రావు, బషీర్ తదితరులు పాల్గొన్నారు.