Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ- మోటకొండూర్
మండలంలోని ప్రతి గ్రామానికో ఆర్టీసీ బస్సు కాదు.. మండలానికి ఒక్క ఆర్టీసీ బస్సు అయినా నడపండి మహాప్రభో అని ప్రజలు అధికారులను వేడు కోవాల్సిన పరిస్థితి నేడు మండల ప్రజలకు ఏర్పడింది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ లాక్ డౌన్ ఎత్తి వేశాక నేటికి మండల ప్రజల కనుచూపు మేరలోకూడా ఆర్టీసీ బస్సు కనబడటం లేదు. మండలం మీదుగా అమ్మనబోలు, వర్టూర్, చందేపల్లి, సింగారం, చామపూర్, పల్లెపాడు, పారుపల్లి, ఉప్పలపహడ్, మీదుగా మోత్కూర్ వరకు మొత్తం సుమారు 15 ట్రిప్పులు, గంటకు ఒక ఆర్టీసీ బస్సులు నడిచేవి .అక్కడి నుండి ప్రజలు నిత్యం జిల్లా కేంద్రం అయిన భువనగిరి, హైదరాబాద్ కు వందల సంఖ్యలో ప్రయాణాన్ని కొనసాగించేవారు. గతంలో మోటకొండూర్ రూట్ లోనే అధిక లాభాలు వచ్చేవని గత అధికారులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేడు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో పేద మధ్యతరగతి ప్రజలను ఆర్టీసీ కి దూరం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేది ఎక్కువగా సామాన్య, పేద మధ్యతరగతి ప్రజలే అని ఆర్టీసీ కి లాభాలను తెచ్చేది కూడా వారేనని అధికారులు గుర్తుంచుకోని బస్సులను యథావిధిగా కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.వివిధ గ్రామాల నుండి ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే రవాణా సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు డిపో మేనేజర్ దష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిపించాలి
కొంతం మోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్, మోటకొండూర్,
ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజల అవసరనిమిత్తం మండల కేంద్రానికి బస్సులు యథావిధిగా కొనసాగించాలని అధికారులను గతంలో పలుమార్లు కోరాం. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డి చొరవ తీసుకుని బస్సులను నిడిపించేవిధంగా చర్యలు తీసుకోవాలి.
నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి,
ఇదే విషయమై నవతెలంగాణ రిపోర్టర్ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డితో ఫోనులో సంప్రదించగా పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తూ, దాటవేత ధోరణి అనుసరిస్తూ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆఫీస్‌కి వచ్చి మాట్లాడండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.