Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మోత్కూర్
శ్మశాన వాటిక స్థలం ఎంపికలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న భవనం మూసీ పాలు కానుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని పొడిచేడులో శ్మశాన వాటిక నిర్మాణానికి ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. మూసీ ఒడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేసిన పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి నిర్లక్ష్యంతో ప్రస్తుతం చేపడుతున్న భవన నిర్మాణ పనులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు బేస్మెంట్ సైతం కోతకు గురైంది. మున్ముందు మూసీ వాగు పొంగితే ఆ వరద ఉధతికి శ్మశాన వాటిక ఉంటుందా లేదా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తూ అధికారుల పనితీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ప్రస్తుతం నిర్మిస్తున్న శ్మశాన వాటిక స్థలాన్ని ముంచేస్తూ మూసీనది ప్రవహించింది. అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత చర్యలతో ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు నీటి పాలు కానున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం, ఇంజినీరింగ్ అధికారుల ఎస్టిమేషన్ వైఫల్యం మూలంగా నాణ్యత లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి శ్మశాన వాటిక పనులు నాణ్యత లోపించకుండా పూర్తి చేసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.