Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
ఆగస్టు 9 క్విట్ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశ సార్వభౌమత్వం కోసం, దేశ సంపదను లూటీ చేసి కార్పొరేట్సేవలో తరిస్తూ, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దేశ వ్యతిరేక విధానాలపై దేశ రక్షణ కోసం మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు.శుక్రవారం మండలకేంద్రంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల మండలం విస్తత సంయుక్త సమావేశం మిరియాల భరత్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.రైతు వ్యతిరేకచట్టాలను రద్దు చేయాలని, ఏడు నెలలకు పైగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ సంస్కరణల బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి కూలీల డబ్బులను కులాల వారిగా నిర్ణయించడం సరికాదన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు సేవ్ఇండియా నినాదంతో జూలై 30న మూడుసంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. 25 నుండి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను చైతన్యం చేయడానికి అన్ని మండల,గ్రామ,పట్టణ కేంద్రాలలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఆగస్టు 2,3,4వ తేదీలలో గ్రామ పట్టణ మండల ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలని, ఆగస్టు 9న క్విట్ ఇండియాలి ఉద్యమ స్ఫూర్తితో సేవ్ఇండియా నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ యసరాని శ్రీనివాస్, రైతు సంఘం నాయకులు బోళ్ల ఎట్టయ్య, నాయకులు రావిరాల శ్రీను, సిహెచ్ శంకరయ్య, ఎర్ర అరుణ, యాదయ్య, ఈశ్వరయ్య, కమలమ్మ పాల్గొన్నారు.