Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
- సాగు భూమికి, కౌలు రైతుకు రైతుబంధు ఇవ్వాలి
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
చిన్నారులకు కరోనాతో ఇబ్బంది ఉండదని మెడికల్ బోర్డు తెలుపుతున్న దష్ట్యా రాష్ట్రంలో అన్ని పాఠశాలలు ప్రారంభించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ ఎఫెక్ట్ ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం పాఠశాలను ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణలో విద్య పరంగా నాలుగు భాగాలుగా విభజించి కమిటీలు వేసి పాఠశాలను తెరవాలని తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి ఒక కమిటీ కార్పొరేషన్ పరిధిలో మరో కమిటీ, జిల్లా కేంద్రాలు ఇతర ప్రాంతాలు ఒక కమిటీ, గ్రామీణ ప్రాంతాలను మరో కమిటీలు వేయాలన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, జిల్లా వైద్యాధికారులను కమిటీలో భాగస్వాములను చేస్తూ విద్యను కొనసాగించాలని తెలిపారు. ప్రభుత్వ బడులకు తాళం వేయడానికి తీయడానికి ఎవరూ లేరని సర్వీస్ పర్సన్లను నియమించాలని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీలను చేపట్టాలని భార్యాభర్తల అంతర్ జిల్లా బదిలీలు సైతం నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఆచార్య, సహా ఆచార్య భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. ప్రాథమిక పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్మరెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వలను సత్వరం పూర్తి చేసి రామన్నపేట, చిట్యాల, నార్కట్ పల్లి మండలాలకు సాగునీరు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. పీహెచ్‌సీలు బలోపేతం చేసి, గ్రామీణులకు పూర్తి స్థాయిలో వైద్యం అందేలా చూడాలన్నారు. చిట్యాల,భువనగిరి రోడ్డును ఫోర్లైన్వేగా నిర్మించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ తయారికి వసతులు లేని అమెరికా 35 కోట్ల జనాభాకు రెండు డోస్‌లకు 70 కోట్ల అవసరం ఉండగా 120 కోట్లు డోస్‌లను నిల్వ చేసుకుందని తెలిపారు. దేశ జనాభాకు రెండు డోసులు వ్యాక్సిన్ అందించడంలో భారత ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరోనా కారణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దేశ ప్రజలు కోల్పోయారని, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దేశ ప్రజలు నగరాలు, పట్టణాల నుండి గ్రామాలకు వలస వెళ్లారు. ఇబ్బందుల్లో ఉన్న దేశ జనాభాకు నెలకు రూ. 7500 ఇవ్వాలని అభ్యుదయవాదులు, వామపక్ష శక్తులు ఇవ్వాలని కోరినీ ఈ పాలకులు స్పందించడం లేదన్నారు. ఇదే అదునుగా భావించి కార్పొరేట్, ప్రైవేట్ శక్తులు దేశ సంపదను అధిక ధరలతో పేరుతో కొల్లగొట్టాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ చట్టం భవిష్యత్తులో వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తాయని అన్నారు. ఇప్పటికిప్పుడు ఆ చట్టాల గురించి అర్థం కాకపోయినా రానున్న సంవత్సరాల్లో రైతులకు విత్తనాలు, ప్రజలకు తిండిగింజలు ధరలు ఆకాశాన్ని అంటుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ రెడ్డి , సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, బొడ్డు పల్లి వెంకటేశం, తదితరులు ఉన్నారు.