Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఉపాధిహామీ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలను కులాల వారీగా విభజించి ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలనే జీవోను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాలడుగు నాగార్జున, వ్యకాస జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజాసంఘాలు, కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో ఆనాటి ప్రభుత్వం కులాలకతీతంగా, మతాల కతీతంగా, ప్రాంతం, వర్గం, లింగ భేదం లేకుండా, ఆడామగా తేడా లేకుండా వందరోజుల పని గ్యారెంటీగా కల్పించాలని సమాన వేతనాలు అమలు చేసిందన్నారు.తద్వారా కూలీలకు ఉపాధి లభిస్తుందని ఉద్దేశ్యంతో ఉపాధిహామీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారతరాజ్యాంగానికి విరుద్ధంగా కూలీలను కులాల వారీగా విభజించి ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని చూడడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.వెంటనే కులాల వారీగా విభజించి జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరుశరాములు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు ఎండీ జహంగీర్,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు బోగిరి రామకోటి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి నిమ్మల పద్మ, డిగ్రీ లింగయ్య, నల్లా వెంకటయ్య, గోలి నర్సింహ, ఖమ్మంపాటి శంకర్, గోలి లక్ష్మయ్య పాల్గొన్నారు.