Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వేమవరపు జానకమ్మ జ్ఞాపకార్థం కళాశాలలో స్వర్ణపతకాన్ని నెలకొల్పి అందించనున్నట్టు స్థానిక ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వేమవరం మనోహర్ పంతులు తెలిపారు. మంగళవారం జనంపల్లి గ్రామంలో స్థానిక కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య మనోహర్ పంతులు కలిసిన సందర్భంలో స్వర్ణ పతకం ప్రతిభ పురస్కారం నిధి నిమిత్తం లక్ష రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ పంతులు మాట్లాడుతూ అపారమైన మేధస్సు, అనుభవం, అంకిత భావం కలిగిన అధ్యాపకులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ఎంతో అభివద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థికి ప్రతి సంవత్సరం బహూకరించాలని కోరారు. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ డబ్బును శాశ్వత డిపాజిట్ కింద బ్యాంకులో ఉంచి వచ్చే వడ్డీతో స్వర్ణపతకం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ డా. ఆర్.యాదగిరి, సమన్వయ కర్తగా వ్యవహరించగా వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రీ, అధ్యాపకులు శ్రీకాంత్, మక్లా, బాల నర్సింహ, పీర్ సాహెబ్, ఇందిర,పి.రమాదేవి, మధు, తుల్జాభవాని, ఎస్.రమాదేవి పాల్గొన్నారు.