Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా మంచానికే పరిమితమైన కొడుకు
- వైద్యానికి వ్యవసాయ భూమి, ప్లాటు అమ్మిన తల్లిదండ్రులు
- ఓ నిరు పేద రిక్షా కార్మికుడి కుటుంబ దీనగాథ
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన వల్లాల సత్తయ్య నిరుపేద రిక్షా కార్మికుడు. అతనికి భార్య అనసూర్య, ఇద్దరు కుమారులు అనిల్ కుమార్, రామకష్ణ ఉన్నారు. సత్తయ్య సుమారు 35 ఏండ్లుగా మోత్కూరు పట్టణంలో రిక్షా తొక్కుతున్నాడు. భార్య అనసూర్య కూలి పనులకు వెళుతుంటుంది. భార్యాభర్తలిద్దరు వచ్చిన కొద్దిపాటి డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేశారు. కాగా పెద్ద కుమారుడు అనిల్ కుమార్ పెళ్లి చేసుకుని బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు. తండ్రి సత్తయ్య వయస్సు మీద పడటం, రిక్షాలకు పని చేప్పేవారు లేకపోవడంతో అతను కూడా కూలి పనులకు వెళుతున్నాడు. దీంతో తల్లిదండ్రుల కష్టం చూడలేక చిన్న కుమారుడు రామకష్ణ చదువు మధ్యలోనే ఆపేసి సెంట్రింగ్ పనికి వెళ్లడం మొదలెట్టాడు. ఎడెనిమిదేళ్లుగా సాఫిగా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఓ మేస్త్రీతో కలిసి తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంక్
నిర్మాణం పనికి వెళ్లాడు. 2019 ఆగస్టు 28న ఆ ట్యాంక్ పైన సెంట్రింగ్ విప్పుతుండగా కర్రలకు కట్టిన తాళ్లు తెగిపోవడంతో రామకష్ణ (24) పై నుంచి (45 అడుగులు) ఒక్కసారిగా కింద పడటంతో వెన్నెముక విరిగిపోయి బలమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి వెన్నుపూసకు రెండు రాడ్లు వేశారు. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి రెండు కాళ్లు పని చేయడం లేదు. స్పర్శ కూడా లేదు. కొడుకును ఎలాగైనా బాగు చేసుకోవాలన్న తాపత్రయంతో ఆ తల్లిదండ్రులు ఉన్న ఎకరం భూమి, ప్లాటును రూ.6 లక్షలకు అమ్ముకుని ఎన్నో ఆస్పత్రులు తిప్పారు. ఆయుర్వేద వైద్యం చేయిస్తే బాగవుద్దంటే కర్ణాటక, ఆర్మూర్, వికారాబాద్ లాంటి ప్రాంతాలకూ తీసుకెళ్లారు. ఎక్కడకు వెళ్లినా డబ్బులు ఖర్చవడమే తప్ప ఏమాత్రం ఫలితం లేకపోవడంతో చివరకు గాంధీ వైద్యుల సూచన మేరకు ఇంటి వద్దే ఉంచి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. 15 రోజులకోసారి మూత్రం పైపు మార్చాల్సి వస్తుండటంతో రూ.1500లు ఖర్చవుతున్నాయని, వైద్యం కోసం ఇప్పటికే రూ.8 లక్షలకు పైగా ఖర్చు చేశామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సాయం కోసం సదరం సర్టిఫికెట్ తెచ్చి దరఖాస్తు చేసుకున్నా ఆసరా పింఛన్ కూడా అందలేదు. కనీసం వీల్ చైర్ కూడా ఇవ్వకపోవడంతో తామే రూ.8500 పెట్టి వీల్ చైర్ కొన్నామని వాపోయారు. కొడుకు వైద్యం కోసం ఉన్నదంతా అమ్ముకుని వీధిన పడ్డారు.
మా కుటుంబాన్ని ఆదుకోండి
వల్లాల సత్తయ్య, అనసూర్య, తల్లిదండ్రులు
మా చిన్న కొడుకు రామకష్ణ వైద్యం కోసం ఉన్న భూమి, ప్లాటు అమ్ముకున్నాం. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా కొడుకు ఆరోగ్యం బాగుపడలేదు. పూర్తిగా మంచానికే పరిమితం కావడంతో దగ్గరుండి అన్ని సేవలు చేయాల్సి వస్తుంది. వైద్యం ఖర్చులకు, పూటగడవడానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం, దాతలు మా కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం.