Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటాపోటీగా అధికారాన్ని ఉపయోగించిన అధికారులు
- విద్యుత్ సిబ్బంది నిరసన
- రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత...
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యుత్ శాఖ వర్సెస్ మున్సిపాలిటీ..విద్యుత్ శాఖ వర్సెస్ మోటార్ వాహనాల తనిఖీ శాఖల మధ్య గురువారం రసవత్తరంగా గొడవ సాగింది. ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించింది. దాని గడువు తీరడంతో ఆటోమెటిక్‌గా మున్సిపాలిటీ, ఎంవీఐ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆ రెండు శాఖల అధికారులు విద్యుత్ శాఖ అధికారులపై తమ అధికారాన్ని ఉపయోగించారు. మున్సిపల్ అధికారులు ఏకంగా పాత బస్టాండ్‌లో ఉన్న విద్యుత్ వసూల్ కేంద్రం భవనానికి ఆస్తి పన్ను చెల్లించలేదని సాకుతో సీజ్ చేశారు. ఎంవీఐ అధికారులు విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నిలబడి కార్యాలయానికి వచ్చి వెళ్లే వాహనాలతో పాటు విద్యుత్ సిబ్బంది వాహనాలను నిలిపి వేసి కేసు నమోదు చేశారు. సుమారు పది మందిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ఆ వాహనాలను స్థానిక బస్టాండ్‌లో ఉంచారు. దీంతో ఆగ్రహించిన విద్యుత్ సిబ్బంది కార్యాలయం నుంచి సరఫరా అయ్యే విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్చలు జరిపి సిబ్బందిని శాంతింపజేశారు. అనంతరం యధావిధిగా విద్యుత్ సరఫరాను కొనసాగించారు.