Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లు దాటినా పూర్తికాని డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు
- ఇంకెప్పుడిస్తారని ప్రశ్నిస్తున్న లబ్దిదారులు
నవతెలంగాణ - తిరుమలగిరి
పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ హామీ 'ఇంకెంతదూరం' అన్న సామేతను గుర్తు చేస్తోంది. అట్టహాసంగా నిర్మాణాలను ప్రారంభించిన ప్రభుత్వం ఐదేండ్లు కావస్తున్నా నేటి వరకూ పూర్తి చేయలేదు. ఫలితంగా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామ సమీపంలో 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ 29-02-2016న శంకుస్థాపన చేశారు. అదే విధంగా వెలిశాల గ్రామంలో 22 ఇండ్లకు శంకుస్థాపన చేశారు. అనంతారం గ్రామంలో ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. కానీ వెలిశాల గ్రామంలో ఇప్పటి వరకూ ఎలాంటి పనులూ మొదలు పెట్టలేదు. అనంతారంలో కొన్ని ఇండ్లు పూర్తి కాగా మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఐదేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేదని, ఇంకెప్పుడు పంపిణీ చేస్తారని ప్రజలు ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులకు ప్రశ్నిస్తున్నారు.