Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్మెన్ల తొలగింపు
- మనుగడే ప్రశ్నార్ధకం చేయాలనే కుట్రలో భాగమే..?
- నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకత్వమే చేసిందనే పుకార్లు
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై 'అధికార' వివక్ష సాగుతుందా...తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసుల పాలైన ఆయనకు జనంలో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన వారికి మింగు పడడం లేదా..అందుకే ఆయన పట్ల వివక్ష చూపిస్తున్నారా...ఈ నేపథ్యంలోనే ఆయనకున్న గన్మెన్లను తీసేయించారా..అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే సమాధానం ప్రతి ఒక్కరి నుంచీ వస్తోంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కల్గిన వ్యక్తి, వామపక్ష పార్టీలో ఉంటూ అనేక ఉద్యమాల్లో పనిచేశారు. ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ప్రజల ఆశలు, ఆలోచనలను అర్థం చేసుకుని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యయ్యారు. నాటి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరారు. నాటి నుంచి నకిరేకల్ కేంద్రంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండో సారి అతిస్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు.
థ్రెట్ లేదనే సాకుతో....?
ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే అంశంలో ప్రతి నాలుగు నెలలకోసారి సమీక్ష చేస్తారు. అందులో ఎవరికైనా గన్మెన్లతో అవసరం లేదు.. ఎలాంటి ప్రాణహానీ లేదంటే వారికి ఉన్న భద్రతను తొలగిస్తారు. అయితే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం వామపక్ష ఉద్యమాల్లో పని చేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ అనేక పోరాటాలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పార్టీని, అధినేతపై ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒంటికాలుమీద లేస్తూ తగిన విధంగా స్పందించేవారు. జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పెద్ద రాజకీయ యుద్ధమే చేశారు. జిల్లా కేంద్రంలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రతిపక్ష పార్టీలు, నాయకులను తగిన రీతిలో విమర్శించేవారు. బత్తాయి మార్కెట్ ప్రారంభ సమయంలో జరిగిన గొడవల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. చిట్యాల ఎంపీపీ ఎన్నిక సమయంలోనూ కేసులు నమోదయ్యాయి. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సమయంలో కొంతమంది ఆయన్ను కావాలని గత ఎన్నికల్లో ఓడించినట్టు అప్పట్లో విస్తృత ప్రచారం జరిగింది.
వీరేశం గన్మెన్ల తొలగింపు
జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గన్మెన్లు ఉన్నప్పడు కేవలం వేముల వీరేశంకు ఎందుకు తొలగించారనేది ఇప్పుడు ప్రశ్న. మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న నియమాలు..వీరేశంకు ఎందుకు వర్తించవనే ప్రశ్న పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో తలెత్తుతోంది. ఇప్పుడు జిల్లాలో ఉన్న టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఏ ఎమ్మెల్యేలకూ ఇతరుల నుంచి హాని ఉందో పార్టీ జిల్లా నాయకత్వం బహిర్గతం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
జిల్లా నాయకత్వమే చేసిందనే పుకార్లు
కేవలం వేముల వీరేశం ఒక్కడికే గన్మెన్లను తొలగించడంతో ఆయన్ను ప్రజల మధ్య అభాసుపాలు చేయాలని చూస్తున్నట్టు ఆ నియోజక వర్గ ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ పని జిల్లా నాయకత్వమే చేసిందనే విమర్శలూ వస్తున్నాయి. ఏ పదవి లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని తక్కువ చేసి చూపేందుకు జిల్లా నాయకత్వం కుట్ర చేస్తుందనే ఆరోపణలున్నాయి.
అయితే గన్మెన్ల తొలగింపు నిర్ణయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసి ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అందుకే జిల్లా నాయకత్వమే ప్రజల మధ్య చులకన చేసే పనిలో భాగంగానే ఈ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వేముల వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో, కరోనా కష్ట కాలంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అలాంటి వ్యక్తి పట్ల జిల్లాకు చెందిన కొందరు టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుట్రలు సరికావని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వీరేశంకు ఉన్న గన్మెన్లను తిరిగి నియమించాలని వారు కోరుతున్నారు.