Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీలో గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్ల చెలామణి సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రతి బుధవారం మున్సిపాలిటీ పరిధిలో జరిగే సంతకు చుట్టూ పక్కల మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తూ తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. పెద్ద మొత్తంలో జనం రావడంతో దొంగనోట్లు చలామణి చేసే వాళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన సంత జరిగింది. సంతలో హోల్ సేల్ వ్యాపారులు భాగ్యమ్మ, రవిలు కూరగాయలను రిటైల్ వ్యాపారులకు విక్రయించి డబ్బులు తీసుకున్నారు. ఇంటికెళ్లే క్రమంలో డబ్బులు లెక్కిస్తే అందులో రూ.100, రూ.500 నోట్లు నకిలీగా తేలాయి. భాగ్యమ్మకు రూ.1800, రవికి రూ.1200 దొంగ నోట్లు రావడంతో ఇబ్బంది పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో దొంగనోట్ల వ్యాపారం చాపకింద నీరులా సాగుతోంది. దొంగనోట్లు చలామణి చేసే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇలా చేసినట్టు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.