Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 45 ఫిర్యాదులను స్వీకరించినట్టు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలనుంచి అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసినప్పుడు సమస్యల పరిష్కారానికి అధికారులు వివిధ శాఖల సమన్వయంతో పనిచేయాలని కోరారు. భూమి సమస్యలు, ధరణి వెబ్ సైట్లో నమోదు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, పింఛన్ కోసం దరఖాస్తులు అందినట్టు తెలిపారు.
హరిత హారంలో నూరుశాతం లక్ష్యం సాధించాలి
హరితహారం కార్యక్రమంతో పాటు ఇతర ప్లాంటేషన్ లక్ష్యాన్ని వారంలోగా నూరు శాతం సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆమె మున్సిపల్ కమిషనర్లు, ప్లాంటేషన్ లక్ష్యాలు నిర్దేశించిన, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హరితహారం కార్యక్రమం కింద 30 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి గాను ఇప్పటివరకు దాదాపు 40 శాతం, ప్లాంటేషన్ కింద నిర్దేశించిన 22 లక్షల మొక్కలు నాటాల్సిన లక్ష్యానికి గాను 53శాతం లక్ష్యం సాధించినట్టు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని మున్సిపల్ కమిషనర్లు అధికారులు వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేపట్టి ఆన్లైన్ పోర్టల్లో విధిగా అప్డెట్ చేయాలన్నారు.
మున్సిపాలిటీలు, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన ఏవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఫొటోలు తీసి పంపించాలని ఆదేశించారు. మోత్కూర్ మున్సిపాలిటీ 5200 మొక్కల లక్ష్యాన్ని గానూ 103 శాతం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 11,900 మొక్కలకు గాను 101శాతం, ఆలేరు మున్సిపాలిటీ 5420 మొక్కల లక్ష్యానికి గాను 95 శాతం, పోచంపల్లి మున్సిపాలిటీ 23,680 లక్షల 96 శాతం లక్ష్యం సాధించినట్టు కమిషనర్లు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ ఉపేందరెడ్డి, డీపీఓ సాయి బాబా, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఎక్సైజ్, విద్య, అటవీశాఖ అధికారులు,మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.