Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
- సీపీిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -రామన్నపేట
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని, 75 ఏండ్ల స్వాతంత్య్రం సాక్షిగా దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు పిలుపునిచ్చారు. రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో ఆ పార్టీ నాయకులు మిర్యాల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ గ్రామ శాఖ 13వ మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అన్ని రకాల ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. ఇజ్రాయిల్ కు చెందిన ప్రైవేట్ కంపెనీ రూపొందించిన పెగాసన్ అనే రహస్య సాఫ్ట్వేర్ను ఉపయోగించి దేశంలో ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, మేధావులతో పాటు ప్రతిపక్షాలు ఆఖరికి సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా నిఘా పెట్టి గూఢాచార్యాన్ని నరేంద్రమోడీ నిర్వహిస్తున్నాడని విమర్శించారు. పెగాసన్పై చర్చించాలని విపక్షాలు కోరితే ఏ మాత్రం పట్టించుకోకుండా అసలు రంగు బయట పడుతుందన్న నెపంతో పార్లమెంట్ సమావేశాలను ముగించారని తెలిపారు. మరోవైపు ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను, స్వాతంత్య్రం గోప్యతపై దాడి కొనసాగిస్తున్నాడన్నారు. ఆనాడు దేశం బ్రిటిష్ పాదాల కింద నలిగితే ఈనాడు మోడీ పాదాలకింద నలుగుతుందని విమర్శించారు. మత ప్రాతిపదికన జనాన్ని విడదీస్తున్న బీజేపీ పౌరసత్వానికి కూడా అలాంటి ప్రతిపాదనే ఆపాదిస్తున్నారని మోదీ అమెరికన్ సామ్రాజ్యవాదానికి తొత్తుగా మారారని విమర్శించారు. బీజేపీ దివాళాకోరు విధానాల వల్ల దేశంలో దారిద్య్రం, ఆకలి పెరిగిందన్నారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తోందన్నారు. ఎంతో మంది అమరుల త్యాగాల వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు భారత దేశ పౌరులందరూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాల వైపు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి జల్లెల పెంటయ్య, శాఖ కార్యదర్శి బల్గూరి అంజయ్య, స్థానిక ఎంపీటీసీ బడుగు రమేష్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, కూనూరు శ్రవణ్, దోమలపల్లి నర్సింహ, అంబటి సురేందర్ రెడ్డి, గిరి లింగస్వామి, రాపోలు ప్రభాకర్, కూనూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.