Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ దళిత నాయకులు
- ఇరువర్గాల మధ్య వాగ్వివాదం
నవతెలంగాణ-మోత్కూరు
బహుజన, దళిత నాయకుడు పాల్వాయి నగేష్ టీఆర్ఎస్ గూండాల దాడిని ఖండిస్తూ, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమం టీఆర్ఎస్, బీఎస్సీ నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గంలో దళిత బంధు అమలు కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, పాల్వాయి నగేష్ పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన టీఆర్ఎస్ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్సీ మండల నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడానికి వచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్ దళిత నాయకులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వకుండా బీఎస్పీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జోక్యం చేసుకోగా ఓ పక్క బీఎస్పీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించగా, మరో పక్క టీఆర్ఎస్ దళిత నాయకులు వ్యతిరేక నినాదాలు చేశారు. తమ కార్యక్రమం ముగించుకుని బీఎస్పీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో టీఆర్ఎస్ దళిత నాయకులు కూడా వెళ్లిపోయారు. బీఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి కొంగరి అరుణ, బందెల శ్రీను తదితరులు పాల్గొనగా, టీఆర్ఎస్ దళిత నాయకులు చెడిపెల్లి రఘుపతి, మెంట నగేష్, దాసరి తిరుమలేష్, దండ్ల కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.