Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుంజుకుంటున్న టీఆర్ఎస్
- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ప్రకటన
- అయోమయానికి గురవుతున్న కార్యకర్తలు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మరోసారి సంచలన ప్రకటన చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఆయన సంచలన ప్రకటనలు పార్టీకి మేలు చేయక పోను తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా చండూరు మండలంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఆయన శిర్దెపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బందు తోపాటు అభివద్ధి పనులకు రూ.3 వేల కోట్లు ప్రకటించిన మాదిరిగానే మునుగోడు నియోజకవర్గానికి రూ.1500 కోట్లు కేటాయిస్తే తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీిఆర్ఎస్ కొన్నారని తనతో 13 అవుతారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రకటనల వల్ల మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కనుమరుగవుతున్న పరిస్థితి నెలకొంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధిగా మనుగడ కొనసాగిస్తూనే కాంగ్రెస్ను విమర్శించడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న బీజేపీ, నిన్న షర్మిలకు మద్దతంటూనే.. నేడు టీిఆర్ఎస్లో చేరిక వంటి ప్రకటనలు చేయడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి రాజగోపాల్ రెడ్డి తక్షణమే రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. అనేకమంది కార్యకర్తలకు మనసులో ఇదే ధోరణి ఉన్నప్పటికీ బహిరంగంగా చెప్పలేకపోతున్నారు.
కంచు కోటకు బీటలు
ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా వుండేది. రాజగోపాల్ రెడ్డి ప్రకటనల వల్ల బీటలు పడుతున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు. మునుగోడు నియోజకవర్గం1967 ఏర్పడినప్పటి నుంచి జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1967,1972, 1978,1983,1999,2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన రాజగోపాల్ రెడ్డి పార్టీని పటిష్టం చేయక పోను విచ్ఛిన్నం చేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నట్టు కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం నుంచి అనేకమంది కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ బలహీనపడడంతో పాటు టీిఆర్ఎస్ బలపడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు గడ్డుకాలం ఏర్పడే పరిస్థితి నెలకొందని పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఇతర పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించుకుంటున్నారు. అనుచిత ప్రకటనల వల్ల కలత చెందిన నాయకులు ఇటీవల చండూరు మండలానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ కాంగ్రెస్కు రాజీనామా చేసి టీిఆర్ఎస్ లో చేరారు. అంతకుముందే చండూరు జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం కాంగ్రెస్ నుంచి గెలుపొంది రాజగోపాల్ రెడ్డి వ్యవహారం శైలి నచ్చక టీిఆర్ఎస్లో చేరారు.
చౌటుప్పల్ మండలంలో ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి కాంగ్రెస్లో ఎంపీపీ గా పదవి సాధించి టీఆర్ఎస్లో చేరారు. ఆయన బాటలోనే ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు పలువురు సర్పంచులు టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం మున్సిపల్ చైర్మెన్ వెన్ రెడ్డిరె రాజు గతంలో కాంగ్రెస్ జెడ్పీటీసీగా పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి చేసిన బీజేపీలో చేరిక ప్రకటనకు కలత చెందిన నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడెం ఎంపీపీ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొంది టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు నచ్చక నియోజకవర్గంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో రోజు రోజుకు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగవుతుంది. ఇదే తరుణంలో టీఆర్ఎస్ బలపడుతుంది.
ఆయా పార్టీలకు నచ్చని రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీ, టీఆర్ఎస్లో చేరుదామని ఎంత ప్రయత్నించినా ఆయా పార్టీలు ఆయన్ను చేరనివ్వడం లేదని పలువురు కార్యకర్తలు విమర్శిస్తున్నారు. సొంత పార్టీలో అధినాయకత్వం వద్ద నమ్మకం కోల్పోయినట్టు కార్యకర్తలు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు. కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయకపోవడం తో 2014లో భువనగిరి ఎంపీ మరోసారి పోటీ చేసి ఓటమికి గురయ్యారు. అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి ధనబలంతో విజయం సాధించారు. ఎమ్మెల్సీ పదవి ఉండగానే రాజీనామా చేసి 2019లో మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.ఎమ్మెల్యే అయ్యాక పీసీసీపై కన్నేశారు. అది రాకపోవడంతో కాంగ్రెస్ను విమర్శించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ లాంటిదని అన్నారు. బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. తాను బీజేపీలో చేరితే కాబోయే సీఎం అన్నారు. ఈ ఆడియో లీక్ అవ్వడం వల్ల ఆయన రాకను బిజెపి నాయకులు అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లిన సందర్భంగా త్వరలో బీజేపీలో చేరుతానని ప్రకటన చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మునుగోడులో జరిగిన శుభకార్యానికి వచ్చిన ఆయన సొంత పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థితో కలిసి గెలుపు కోరుకుంటున్నా అని ఆయా పార్టీలను ఏకం చేసేందుకు కషి చేస్తానన్నారు.
ఇటీవల చండూరు మండలం గ్రామంలో వైఎస్ఆర్సీటీపీఆధ్వర్యంలో షర్మిల నిర్వహించిన నిరుద్యోగ నిరసన దీక్షలు షర్మిలకు మద్దతిస్తున్నట్టు ప్రకటన చేశారు. 2021లో సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి తను పోటీ చేయాలని ఆ పార్టీ అధిష్టానం తనను సంప్రదించిందన్నారు. తానే కనుక పోటీ చేస్తే జానారెడ్డి మూడోస్థానానికి పడిపోతాడని బహిరంగంగానే కామెంట్ చేశారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పైన, జాతీయ నాయకుల పై సైతం కామెంట్ చేశారు. ఇతని అనుచిత వ్యాఖ్యలు వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుంది తప్ప పార్టీ ఎదుగుదలకు దోహదపడడం లేదు అని కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారు.