Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మార్కెట్ వైస్ చైర్మెన్, జెడ్పీటీసీ భర్త జేబులు కొట్టేసిన దొంగలు
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితర నాయకులు హాజరు కావడంతో ప్రజా ప్రతినిధులు, నాయకులు వారికి స్వాగతం పలికి సన్మానించి ఫొటోలు దిగే పనిలో వాళ్లు బిజీగా ఉంటే దొంగలు తమ చేతికి పని చెప్పారు. మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మెగా నియమితులైన మూగల శ్రీనివాస్ జేబు నుంచి దొంగలు రూ.37 వేల నగదును దొంగలించారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ గోరుపల్లి శారద భర్త సంతోష్ రెడ్డి జేబు నుంచి రూ.40 వేలు కొట్టేశారు. అడ్డగూడూర్ మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కన్నెబోయిన గట్టయ్యకు చెందిన రూ.12 వేల ఫోన్, మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన మరో రైతు స్మార్ట్ ఫోన్ ను కూడా దొంగిలించారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బులను దొంగలు దొంగిలించడంతో మార్కెట్ వైస్ చైర్మెన్ ఖంగుతిన్నారు. కార్యక్రమం అయిపోయాక వారు తమ జేబులు చెక్ చేసుకోగా పాకెట్లు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యారు. జెడ్పీటీసీ గోరుపల్లి శారద, ఆమె భర్త సంతోష్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డికి బొకేలు ఇచ్చి స్వాగతం పలుకుతున్న సమయంలో దొంగలు జేబులు కొట్టేసిన దశ్యాలు ఫొటోలు, వీడియోల్లో చిక్కాయి. మంత్రుల పర్యటన సందర్భంగా బందోబస్తుతో ఆర్భాటం చేసిన పోలీసులకు దొంగలు చేతివాటం చూపి ప్రజాప్రతినిధుల జేబులు కొట్టేసి షాక్ ఇచ్చారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలకేంద్రంలో జరిగిన మంత్రుల కార్యక్రమంలోనూ దొంగలు పలువురు నాయకుల జేబులు కొట్టి రూ.లక్షకు పైగా దోచేశారు. కాగా జెడ్పీటీసీ భర్త సంతోష్ రెడ్డితో పాటు మిగతా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫొటోలు, వీడియోల ఆధారంగా దొంగలను పట్టుకుం టారో లేక దొరకడం లేదని వదిలేస్తారో వేచిచూడాలి.