Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోతే
పేదల కోసం కట్టించిన డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేసేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు ప్రశ్నించారు. గురువారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. ఇండ్ల కేటాయింపు కోసం పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి, విచారణ జరిపి రెండు నెలలు దాటుతున్నా నేటికీ లబ్దిదారులను గుర్తించకపోవడం సరికాదన్నారు. మండల కేంద్రంలో 62 ఇండ్లకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, నిర్మాణాలన్నీ నాసిరకంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని వెంటనే అర్హులైన పేదలందరికీ ఇండ్లు పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఈ నెల 8న తమ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సామూహిక గృహప్రవేశాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి జీఎస్, మండల కమిటీ సభ్యులు కె.సత్యనారాయణ, చర్లపల్లి మల్లయ్య, గ్రామ కార్యదర్శి జిల్లాపెళ్లి నాగయ్య, నాయకులు గురజాల వెంకన్న, వెంకన్న, జి.గంగాధర్, ఎల్లయ్య పాల్గొన్నారు.