Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ- రామన్నపేట
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వ స్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సోమవారం మండలంలోని మునిపంపుల గ్రామంలో పోరాట యోధులు గంప వెంకయ్య, ఉండ్రాతి రామయ్య స్మారక స్థూపాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాచం కష్ణ మూర్తి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి, భూక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రపంచ చరిత్రలో లిఖిత అక్షరాలతో రాయబడిన మహోజ్వల పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమని తెలిపారు. ఎర్ర జెండాలు చేతపట్టి ఆంధ్రమహాసభ పిలుపుతో నాలుగువేల మంది అమరులయ్యారన్నారు. పది లక్షల ఎకరాల భూములను పంపిణీ చేసినట్టు తెలిపారు. నిజాం అరాచకాలకు, కాసీం రజ్వీ దౌడ్జన్యాలకు, పటేల్ సైన్యాల తుపాకీ గుండ్లకు ఎదురునిలిచి పోరాడారని గుర్తు చేశారు. ఈ మహా పోరాటాన్ని నేడు బీజేపీ రెండు మతాల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరిస్తూ మత విద్వేశాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర లేని బీజేపీకి మాట్లాడటానికి కనీస అర్హతకూడా లేదన్నారు. రక్తం చిందించి ప్రాణాలర్పించిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు మాత్రమే నిజమైన వారసులన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శి జల్లల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామ సర్పంచ్ యాదాసు కవితయాదయ్య, కూరెళ్ళ నరసింహ చారి, బోయిని ఆనంద్, కందుల హనుమంతు, జంపాల అండాలు, వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, గన్నెబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, మునిపంపుల శాఖ కార్యదర్శి తొలుపునూరి శ్రీనివాస్, తాళ్ళపల్లి జితేందర్, ఉండ్రాతి నర్సింహా, గంటెపాక శివ కుమార్, యం.డి మైనొద్దిన్, జంపాల ఉమాపతి, తొలుపునూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.