Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి
తమ్మినేని వీరభద్రం
సూర్యాపేటలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ
నవతెలంగాణ - సూర్యాపేట
వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డ మీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారామ ఫంక్షన్హాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులు కొంజేటి సత్యవతి, నల్లపాటిలక్ష్మీ నర్సయ్య, పోటు పుల్లయ్య, అబ్బగాని బిక్షం, బాబాసాహెబ్లను సన్మానించారు. అనంతరం నిర్వహించిన సభలో తమ్మినేని మాట్లాడుతూ భూస్వాములు, నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో లిఖించదగిందన్నారు. 10 లక్షల ఎకరాల భూములు పంచడం కోసం, వెట్టి చాకిరి నుంచి ప్రజలను విముక్తి కల్పించడం కోసం 4000 మంది ప్రాణ త్యాగం చేసిన పోరాటం చరిత్రలో మరువలేనిదని అన్నారు. అలాంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధంలేని బీజేపీ సాయుధ పోరాటాన్ని నేడు వక్రీకరిస్తోందన్నారు. సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించి జాతిపితగా పేరు పొందిన గాంధీజీని చంపిన గాడ్సేను దేశభక్తుడని చెప్పడం దుర్మార్గమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి సభలు పెట్టి చర్చించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో పేదలు, రైతుల భూములను ప్రభుత్వాలు లాక్కుంటున్నారన్నారు. గత ప్రభుత్వాల కాలంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్, బంజారాయి భూములను గుంజుకుంటున్నదన్నారు. ధరణి పేరుతో రాష్ట్రంలో పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. తండ్రుల పేరుతో ఉన్న భూములు కూడా పేరు మార్పుడీ కావడం లేదన్నారు. ఎందుకని అధికారులను అడిగితే ధరణి సైట్ ఓపెన్ కావడం లేదని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మీ, ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, ఎల్గూరి గోవిందు, మేకనబోయిన శేఖర్, మట్టిపల్లి సైదులు, జె.నర్సింహారావు, చెరుకు ఏకలక్ష్మి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జుట్టుకొండ బసవయ్య, శంకర్రెడ్డి, పాండు నాయక్, షేక్ యాకోబ్, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాలా బాధ్యులు పాల్గొన్నారు.