Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాపోరాటాలు నిర్వహిద్దాం
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వంతో ప్రజా పోరాటాలు నిర్వహిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి శుక్రవారం మండలంలోని గూడూరు, యాద్గార్పల్లి, తడకమళ్ల గ్రామాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1946 సెప్టెంబర్ నుంచి 1951 అక్టోబర్ వరకూ ఐదేండ్ల పాటు తెలంగాణలో సాగిన ఈ పోరాటం 'భూమి సమస్య'ను భారతదేశ రాజకీయ ఎజెండాలోకి చేర్చిందన్నారు. భూస్వామ్య భావజాలంతో ఉన్న పాలకులు ఈ పోరాటంతో భూమిని మేమే పంచుతామని ముందుకు రాక తప్పలేదన్నారు. తర్వాత వచ్చిన పాలకులు భూమి గురించి, రైతుల గురించి వారి వారి ఎన్నికల ఎజెండాల్లో పెడుతున్నరంటే ఇదంతా నాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలితమేనని చెప్పారు. ఇది ఆ పోరాటంలో అసువులు బాసిన నాలుగు వేల మంది కమ్యూనిస్టు యోధుల త్యాగాల ఫలితమేనని వారు పేర్కొన్నారు. ఈ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమి పంచబడి మూడు వేల గ్రామాలలో ప్రజారాజ్యం ఏర్పడిందని తెలిపారు. భూమి శిస్తులు రద్దు చేయబడ్డాయని, వెట్టి చాకిరీ రద్దై, అప్పటి వరకూ నిర్భందంగా అమలు జరిగిన ఉర్దూ భాషలో విధ్యాబోధన రద్దు చేయబడి తెలుగు సంస్కతి పునరుద్దరించబడిందని పేర్కొన్నారు. ఈ మహత్తర పోరాటాన్ని వక్రీకరించటానికి నేడు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. 45 వేల ఎకరాల విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ముస్లిమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నూకల జగదీశ్ చంద్ర, మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, సీతారాములు, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఎమ్‌డి. అంజద్, పతాని శ్రీను, నాయకులు గొర్ల ఇంద్రారెడ్డి, సత్యనారాయణ రావు, పిల్లుట్ల సైదులు, బొగ్గారపు శ్రీను, గోపి, కష్ణయ్య, బాలాజీ, వెంకయ్య, రామకష్ణ, నగేష్, సైదమ్మ, పల్లా భిక్షం, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.