Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి
గూగుల్ మీట్లో కలెక్టర్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. గులాబ్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు రానున్నందున సోమవారం కలెక్టర్ గూగుల్మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండు రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, వాగులు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలు మరింత అప్రమత్తంగా పని చేయాలన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిందని, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు, డీసీపీి, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
జిల్లావ్యాప్తంగా వర్షం నిరంతరం కురుస్తున్నప్పటికీ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి తరలివచ్చారు. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించగా, కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి 36 ఫిర్యాదులు అందినట్టు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన 25 రాగా మిగతావి ఇతర శాఖలకు సంబంధించి ఉన్నట్లు తెలిపారు.