Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు మేదరమెట్ల సీతారామయ్య 23వ వర్థంతి
తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో కా|| ఎం.ఎస్ చురుకైన పాత్ర పోషించారు. హుజూర్నగర్ ప్రాంతంలో సీపీఐ(ఎం) తీవ్రమైన నిర్భందం కొనసాగింది. పొనుగోడు గ్రామంలో అందె నర్సయ్య, సుందరి బస్వయ్య హత్య, యాతవాకిలలో పున్నం రాజు హత్య, మల్లారెడ్డిగూడెంలో కందుల గుర్వారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి హత్య, వెలిదండలో ఈసారపు వీరయ్య హత్యలతో పాటు వివిధ గ్రామాల్లో భూస్వాములు, గుండాల దాడులు నిరంతరం కొనసాగేవి. ఆ నిర్భందం నుంచి గ్రామాలను కాపాడడంలో సీతారామయ్య ప్రముఖమైన పాత్ర పోషించారు. అనేక గ్రామాల్లో ప్రజాసమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ప్రభుత్వ, బంచరాయి, పోరంబోకు భూములను పేదలకు పంపిణీ చేశారు. లింగగిరిలో కౌలుదారి హక్కుల కోసం జరిగిన పోరాటంలో, అగ్రహారంలో జరిగిన భూ పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. హుజూర్నగర్ తాలూకాలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని నిర్మించడంలో అనేక నిర్భందాలను అధిగమించి ఉద్యమ పురోగతికి కృషి చేశారు. కాంగ్రెస్ గుండాల దారుణాలు, హత్యరాజకీయాలను ఎదుర్కొంటూనే కార్యకర్తలకు రక్షణ కల్పిస్తూ తన ఇల్లునే విప్లవ కేంద్రంగా ఉండేది. ఆయన పేరు వింటేనే శతృవులకు గుండెల్లో గుబులుపుట్టేది. ఆయన నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, ఆయన త్యాగనిరతి నేటి యువతరానికి ఆదర్శం.
వెలిదండ అంటే విప్లవ ఉద్యమాలకు పూదండ. అది నాటికి, నేటికీ వామపక్షాల ఉద్యమాల ఖిల్లా. ఆ దండలో దారంలా ఉద్భవించిన విప్లవయోధుడు కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్య. ఆయన త్యాగనిరతి, ధైర్యసాహసం, కార్యదీక్ష, ఆయన వాగ్దాటితో శతృవు గుండెల్లో పరుగులు పెట్టించిన అలుపెరుగని పోరాటయోధుడుగా నేటికి ప్రజల మదిలో స్ఫూరిస్తూనే ఉంది. విప్లవ రాజకీయాలతో ఆయన జీవితం పెనవేసుకొని కమ్యూనిస్టు ఉద్యమంలో తనదంటూ పాత్రను పోషించిన ఎం.ఎస్ వ్యక్తి కాదు... ఆయన ఒక శక్తి. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం. మార్క్సిస్టుసిద్ధాంత అద్యాయం, పోరాట అనుభవం, నిర్మాణదక్షత కలబోసుకున్న విప్లవవీరుడు. అందుకే ఆయన పేరు వింటేనే శతృ శిబిరం గడగడలాడేది. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడుగా, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ 07.10.1998 రోజున అనారోగ్యంతో మృతి చెందారు. నేడు ఆ విప్లవ యోధుని 23వ వర్థంతి సందర్భంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విప్లవ జోహార్లు అర్పిస్తున్నాము.
తెలంగాణలో ప్రజావ్యతిరేకమైన ఫ్యూడల్ వ్యవస్థను కాపాడడానికి కంకణం కట్టుకున్న నిజాం సైన్యాలను, నెహ్రు సైన్యాలను ఎదురించి, పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కామ్రేడ్ సీతారామయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అప్పుడే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనది. విప్లవం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించే సాహసం, ప్రజల కోసం పని చేయడం అత్యున్నత కర్తవ్యమనే విశ్వాసం, స్వప్రయోజనాలను పక్కకు పెట్టి ప్రజల కోసం పని చేయాలనే త్యాగనిరతి, ఆటుపోట్లు ఎన్ని వచ్చినా వెనుతిరగక ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్షాన కొనసాగే చైతన్యం మొదలైన ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తిగా పోరాటరంగం ఆయనను తీర్చిదిద్దింది. ఇదే కామ్రేడ్ సీతారామయ్యకు ఉన్న ప్రత్యేకత. సాయుధ రైతాంగ పోరాటం మహా ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది ఉత్తమ పుత్రుల్లో ఎం.ఎస్ ఒకరు. ''నేను సైతం ప్రపంచాగ్నికి సమిథినొక్కటి ఆహుతిచ్చాను'' అని ఓ మహాకవి అన్నట్టు ఎం.ఎస్. ప్రజాఉద్యమాల్లో ప్రజల కోసం తనవంతు పాత్ర నిర్వహించి ధన్యులయ్యారు. ఆ ఆదర్శమే ఆయన జీవితానికి అమరత్వాన్ని సాధించి పెట్టింది. ఆ పోరాట అనుభవాలే ఆయనను జీవితాంతం ఎప్పటికి సజీవంగా నిలిపాయి.
మేదరమెట్ల సీతారామయ్య 1924లో రైతు కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం వెలిదండ గ్రామంలోని వీధి బడిలో ప్రారంభమైంది. సహజంగా ఆనాటి విద్యా విధానంలో భాగంగా ఇసుకలో అక్షరాలు దిద్దుకున్నారు. వెలిదండ గ్రామంలో ఉన్న ప్రాథమిక విద్య తోటే ఆయన విద్యాభ్యాసం ముగిసింది. సీతారామయ్య 15 ఏండ్ల వయస్సు నుండే పాటలు పాడడం, నాటికలు వేయడం, రామయణం, భారతం, భాగవతం చదివేవారు. నాటకాల్లో అనేక పాత్రలు పోషించేవారు. ఈ విధంగా గ్రామాల్లో తన తోటి యువకులను సమీకరించి నాటకాలు, వీధిబాగోతాలు వేస్తూండేవారు. తన 18వ యేటలోనే వెలిదండ గ్రామంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డారు. వెలిదండ గ్రామ ప్రజల మీద పటేలు వక్కవంతుల కోటయ్య - మట్టయ్యల కుటుంబం చేసే అక్రమాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప వ్యక్తి కా|| ఎం.ఎస్.
నిజాం సంస్థానంలో కొంత భాగం జాగీర్దారీ పాలన కింద ఉండేది. మరికొంత భాగం పటేల్, పట్వారీ వ్యవస్థ ద్వారా డైరెక్టుగా నిజాం పాలన కింద ఉండేది. గ్రామాలన్నీ భూస్వామ్య పెత్తందారుల ప్రాభల్యం కిందనే ఉండేది. వెలిదండ గ్రామంలో కూడా నాడు పటేలు, పట్వారీ పాలన కొనసాగుతుండేది. వెలిదండ గ్రామానికి పక్కనే బేతవోలు జమీందారి గ్రామాలు, మరో పక్క బ్రిటీష్ పాలన కింద ఉన్న మునగాల జమీందారి గ్రామాలు ఉండేవి. జమీందారి, జాగీర్దారీ గ్రామాల్లో సాధారణంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులతో పాటు జమీందారి, జాగీర్దార్ వారి స్వఅవసరాల కోసం కూడా నిర్భందపు పన్నులు ప్రజలు చెల్లించేవారు. పటేల్, పట్వారి, జమీందారి, జాగీర్ధార్లు ప్రజలపై దౌర్జన్యాలు చేసేవారు. ఈ స్థితిలో వెలిదండ గ్రామములో కూడా పటేలు, పట్వారిలు వెట్టిచాకిరి, దోపిడి, దౌర్జన్యాలు సాగుతూ ఉండేవి. ఆ గ్రామములో రైతుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, ప్రజలకు భూ తగాదాలు పెట్టి కేసుల్లో ఇరికించడం, అప్పులిచ్చి హెచ్చు వడ్డీ రేట్లు గుంజటం, పేదల భూములను తాకట్టు పెట్టుకోవడం, భూమి శిస్తులను అధికంగా విధించడం, జరిమానాలు విధించడం, కట్టకపోతే ఇండ్లను జప్తు చేసేవారు. ఇలాంటి ఆగడాలు గ్రామములో కొనసాగేవి. ఈ తరుణంలో గ్రామంలో ఆంధ్రమహాసభ కార్యకలాపాలను చాపకింద నీరులా ఎం.ఎస్ వ్యాపింపజేశారు. గ్రామంలో పటేల్, పట్వారీ ఆగడాలకు వ్యతిరేకంగా సీతారామయ్య ప్రతిఘటించేవారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని సీతారామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతున్నాడని సీతారామయ్యపై పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. గ్రామానికి వచ్చిన పోలీసులు సీతారామయ్యతో పాటు కొంత మంది యువకులను అరెస్టు చేసి కోదాడ, సూర్యాపేటకు తరలించి, ఆ తర్వాత హైదరాబాద్ జైల్లో నిర్భందించారు. వీరిపై కేసు ఏమిటో తెలియదు, విచారణ జరగలే.. ఆ విధంగా తొమ్మిది నెలలు జైల్లో నిర్భందించారు.
కామ్రేడ్ సీతారామయ్య జైలు జీవితాన్ని అనుభవిస్తునే కమ్యూనిస్టు రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. జైలుకు వచ్చిన యువకులందరికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాజకీయాలు చెప్పేవారు. జైల్లో మార్క్సిజం, రష్యా విప్లవం, సోషలిస్టు రాజ్యాంగం గురించి, చైనాలో విస్తరిస్తున్న విప్లవం గురించి జైల్లో నేర్చుకున్నారు. తొమ్మిది నెలల నిర్భందం తర్వాత సీతారామయ్య జైలు నుంచి తిరిగి వచ్చేసరికి వెలిదండ పక్కనే ఉన్న మునగాల పరగణ గ్రామమైన కొక్కిరేణిలో కమ్యూనిస్టు పార్టీ సెంటర్ ఏర్పాటు చేసి నడుపుతున్నారు. పరగణ గ్రామాలు కాబట్టి అక్కడ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం లేదు. జైలు జీవితం అనంతరం గ్రామంలోకి వచ్చి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం చాలా చురుగ్గా పనిచేసేవాడు. పక్కనే ఉన్న మునగాల జమీందార్కు వ్యతిరేకంగా పరగణ గ్రామాల్లో అప్పటికే నిర్మాణయుతమైన పోరాటాలు సాగుతూ ఉండేవి. బేతవోలు జమీందార్, లింగగిరి జాగీర్ధార్, పొనుగోడు దొర మొదలైన వారి దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కార్యకర్తలు ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో తిరుగుతూ ఉండేవారు. దోపిడీ, దౌర్జన్యాలు, వెట్టిచాకిరి, లంచగొండితనం, లెవి ధాన్యానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రచారం చేసేవారు.
పోలీసు క్యాంపులున్న గ్రామాల్లో కార్యకర్తలు రహస్యంగా ఆంధ్రమహాసభ కరపత్రాలు పంపిణీ చేసేవారు. రాత్రిపూట గ్రామాల్లో ఎర్రజెండా కట్టేవారు. ఈ కార్యక్రమాల్లో యువకులు, స్త్రీలు చురుగ్గా పాల్గొనేవారు. గెరిల్లా పోరాటంలో ప్రజలు భాగస్వాములైనారు. పోలీసు, మిలటరీ దాడులను ఎదుర్కొన్నారు. వెట్టి, దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ విశాల ప్రజానీకాన్ని పోరాటంలోకి సమీకరించింది. ఆ పోరాటంలో సీతారామయ్య ముఖ్యమైన పాత్ర పోషించాడు. సీతారామయ్య నాయకత్వంలో దళాలు బొత్తలపాలెం, బక్కవంతులగూడెం, వెలిదండ, కొక్కిరేణి, రంగాపురం, జెర్రిపోతులగూడెం, మఠంపల్లి గ్రామాల్లో ఉన్న శతృవులను తరిమికొట్టారు. అంతేగాకుండా పోలీసు, మిలటరీ క్యాంపులపై దాడి చేసి ఆయుధాలను సేకరించడంలో ఎం.ఎస్ దళం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అడ్లూరు వద్ద గల అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై దాడి చేసి 74 షార్ట్ గన్నులు, రైఫిల్స్, వెయ్యి తూటాల ఆయుధాలను సేకరించుకొని కాలినడకన కృష్ణానది దాటి ఆయుధాలతో మహబూబ్‌నగర్ చేరుకున్నారు. ఇదే కాక గుంటూరు జిల్లాలో ఏలంపేట పోలీసు స్టేషన్, కర్నూలు జిల్లాలో పుల్లంచెరువు పోలీసు స్టేషన్, కృష్ణా జిల్లా పెనుగ్రంచిప్రోలు క్యాంపు, కర్నూలు జిల్లా గడివేముల పోలీసు స్టేషన్, మిర్యాలగూడెం దగ్గర సుబ్బారెడ్డిగూడెం మిలటరీ క్యాంపులపై దాడులు చేసి ఆయుధాలు సేకరించేవారు. ఆయుధాల సేకరణ సందర్భంగా దళానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కా||సీతారామయ్య దళ సభ్యులలో మరింత పట్టుదలను పెంచి నిలబెట్టేవారు. నిరాశ, నిస్పృహలకు తావు లేకుండా చేయగలగడం ఆయన ప్రత్యేకతగా ఉండేది.
అనసూయ పాత్ర అద్వితీయం
కా|| సీతారామయ్య పైన తీవ్రమైన నిర్భందం, ప్రతిఘటనతో రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. ఆ కాలంలో సీతారామయ్య భార్య అనసూయ రంగాపురంలోని తన తల్లిగారి ఇంట్లో ఉండేది. వారి కుటుంబంపైన కూడా తీవ్రమైన నిర్భందం వచ్చింది. అనేక సార్లు పోలీసులు, మిలటరీ ఆ ఇంటిని దోపిడీ చేశారు. అనసూయతో పాటు వారి అమ్మ, అమ్మమ్మను కొట్టి అనేక చిత్రహింసలకు గురిచేశారు. తల వెంట్రుకలు తీసి గుండు కొట్టించారు. అయినా అనసూయలో ధైర్యం సడలలేదు. అనేక నిర్భాందాలు అనుభవించాల్సి వచ్చింది. ఊహించని ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అవమానాలు భరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కమ్యూనిస్టు రాజకీయాలతో మమేకం కావడంతో సామాజిక అసమానతలు వ్యాప్తి ఉన్న రోజుల్లో కుల పట్టింపులు, అంటరానితనం వంటి దురాభిప్రాయాలను దూరం నెట్టి రాజకీయ ఐక్యతే అన్ని బంధుత్వాల కంటే బలమైనదిగా నమ్మారు. పోరాటం వల్ల వచ్చిన నిర్భందం, ఆర్థిక ఇబ్బందులు ఎన్నడూ లెక్కచేయలేదు. అన్నింటికీ మించి కమ్యూనిస్టు రాజకీయాలు పరిచయం కావడంతో కారుచీకట్లో కాంతిరేకలా సీతారామయ్యకు ఎల్లవేళలా అండగా ఉంటూ నేటికి ధైర్యసాహసాలతో ముందుకు సాగడమే అనసూయలో ఉన్న ఒక గొప్ప లక్షణం.
1967-68 సంవత్సర కాలంలో కొక్కిరేణి గ్రామంలో పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తున్న సందర్భంగా అక్కడ భూస్వాములతో ఘర్షణ ప్రారంభమైంది. ఆ ఘర్షణలో వెలిదండ, రంగాపురం, కొత్తగూడెం, కోనాయిగూడెం, ముకుందాపురం, కొక్కిరేణి, చీదెళ్ళ మొదలైన చుట్టుపక్కల గ్రామాలపై పోలీసులు దాడులు చేస్తూ సీతారామయ్యతోపాటు చుట్టుపక్క గ్రామాల్లోని వందలాది మంది కార్యకర్తలపైన అనేక అక్రమ కేసులు మోపబడ్డాయి. రహస్యంగా ఉన్న, అరెస్టు అయిన కార్యకర్తలు బెయిల్ మీద విడుదలైన తరువాతనే పార్టీ ప్రజలను ఆర్గనైజ్ చేసి గుండాల దాడులను ప్రతిఘటించి పాలకవర్గాల ఏజెంట్లను గ్రామాల నుంచి తరిమివేశారు.
- ములకలపల్లి రాములు
సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
సెల్. 9490098338