Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయవద్దని రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తోందని రైతు సంఘం జిల్లా అద్యక్షులు మేక అశోక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నాయకులు బోయిని ఆనంద్ అధ్యక్షతన ఆ సంఘం మండల కమిటీి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వరి పంట పండించవద్దని ప్రకటన చేయడంతో చెర్వు, కాల్వల పరివాహక ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అయోమయ పరిస్థితుల్లో వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి పంట వేయాలో కనీసం రైతులకు అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంట మార్పిడి చేయాలంటే పంట వేయకముందే గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలుకు గ్యారంటీ కల్పించి ప్రభుత్వమే కొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గన్నెబోయిన విజయభాస్కర్, జల్లేల పెంటయ్య, కందుల హనుమంతు, బావండ్లపల్లి బాలరాజు, పులి భిక్షం, గాదె నరేందర్, బెడిద లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.