Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ - గరిడేపల్లి
విప్లవోద్యమంలో అలుపెరగని పోరాట యోధుడు మేదరమెట్ల సీతారామయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మేదరమెట్ల వర్థంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థను కాపాడేందుకు నిజాం, నెహ్రూ సైన్యాలను ఎదురించి, పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సీతారామయ్య ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. సీతారామయ్య జైలు జీవితాన్ని అనుభవిస్తునే కమ్యూనిస్టు రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారన్నారు. జైలుకు వచ్చిన యువకులందరికీ కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పేవారన్నారు. ఆయన జైలులోనే మార్క్సిజం, రష్యా విప్లవం, సోషలిస్టు రాజ్యాంగం గురించి, చైనాలో విస్తరిస్తున్న విప్లవం గురించి నేర్చుకున్నారని తెలిపారు. జైలు జీవితం తర్వాత గ్రామంలోకి వచ్చి ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం చురుగ్గా పని చేశారని చెప్పారు. సీతారామయ్య నాయకత్వంలో బొత్తలపాలెం, బక్కవంతులగూడెం, వెలిదండ, కొక్కిరేణి, రంగాపురం, జెర్రిపోతులగూడెం, మఠంపల్లి గ్రామాల్లో ఉన్న శతృవులను తరిమికొట్టారని, పోలీసులు, మిలటరీ క్యాంపులపై దాడి చేసి ఆయుధాలను సేకరించడంలో ఎంఎస్ దళం చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, మేదరమెట వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి ఎస్కే.యాకుబ్, మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు, తుమ్మల సైదయ్య, రాచమల్ల రామస్వామి, దోసపాటి బిక్షం, సోమయ్య, అంబటి బిక్షం, సైదిరెడ్డి, లక్ష్మయ్య, బొమ్మకంటి వెంకయ్య, శ్రీను పాల్గొన్నారు.