Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
వానాకాలం వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) మండల జనరల్‌బాడీ సమావేశం చీరిక సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది రైతులు ఇప్పటికే వరి పంట కోశారన్నారు. ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో, ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రజా సంపదను నష్టం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రొడ్డ అంజయ్య, బూర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు రాగీరు కిష్టయ్య, బోయ యాదయ్య, జక్కిడి రాంరెడ్డి, ఆదిమూలం నందీశ్వర్, పొట్ట శ్రీను, పల్లె మధుకృష్ణ, శివకుమార్, బోరెం శ్రీనివాస్‌రెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, అంతటి అశోక్, శ్రీకాంత్, బాలరాజు, చీరిక అలివేలు, చిదుగుల్ల యాదమ్మ, సంజీవ లక్ష్మయ్య, శేఖర్, ఎస్కె.మదార్, బుచ్చిరెడ్డి, సాలయ్య, స్వామి పాల్గొన్నారు.