Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, సీపీఐఎంఎల్ న్యూడెమో క్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, సీపీఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రైతుల మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారున్ని వెంటనే శిక్షించా లని, అజరు మిశ్రాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మోడీ, అమిత్‌షాల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ కేరి లో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఉద్దేశ పూర్వకంగానే కారుతో రైతులను తొక్కించి ఐదుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడ ని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని 10 నెలలకు పైగా రైతులు పోరాడున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు కావాలనే రైతుల ఉద్యమాన్ని నిర్బంధాలు, అరెస్టుల తో పోరాటాలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని మరింత రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై భారాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశ సంపదను, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, షేక్ సయ్యద్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వీరన్న, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.