Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞానసుందర్
నవతెలంగాణ - తుంగతుర్తి
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞానసుందర్ కోరారు. శనివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామపంచాయతీలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆడపిల్లలకు బతికే హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. వివాహాలు, విడాకులు, భార్య పోషణ, ఆస్తిలో మహిళల హక్కులు, కార్మిక చట్టాల గురించి ప్రజలకు వివరించారు. మహిళలు ఎలాంటి భయాందోళనలకూ గురి కాకుండా స్వేచ్ఛ సాధికారతలతో ఉన్నతంగా జీవించగలిగే ప్రశాంత పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గిరిజన, ఎస్సీ, ఎస్టీ మైనర్లకు ఉచిత న్యాయ సహాయం కోసం కోర్టు వారే న్యాయవాదిని నియమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాంతమ్మరాములు, అడ్వకేట్ రాజారాం, ప్రతాప్, వాలంటీర్స్ పేర్ల నాగయ్య, బొంకురి నాగయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.