Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అధ్యక్షతన ఇంటర్మీడియట్ హైపవర్ కమిటీ అధికారులు ఇంటర్ ప్రథమ సంవత్సర థియరీ పరీక్షల నిర్వహణ పరీక్షల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 2 వరకు జరిగే పరీక్షలను పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 44 పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో మొత్తం 7523 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో కోవిడ్ నిబంధనలు పాటించాలని, విద్యార్థులందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సులు విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా నిర్ణీత సమయంలో నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమయంలో మూసివేసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఆర్డీఓ సూరజ్ కుమార్, ఇంటర్మీడియట్ పరీక్షల నోడల్ ఆఫీసర్ బి.సంజీవ, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, సీఐ జానయ్య, జిల్లా పౌరసంబంధాల అధికారి పి. వెంకటేశ్వరరావు, మోత్కూర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కమిటీ మెంబర్ అవిలయ్య, పోచంపల్లి జూనియర్ కాలేజీ లెక్చరర్ శ్రీమతి అరుంధతి, ఆర్టీసీ, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.