Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. కోవిడ్ -19 కారణంగా పరీక్షలకు వచ్చే విద్యార్ధులు తప్పని సరిగా మాస్క్లు ధరించేలా చూడాలన్నారు. థర్మల్ స్కానర్ పరీక్ష, క్లాస్ రూమ్ లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటుతో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. క్లాస్ రూమ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్టు ఒక సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. మంచి నీటి వసతి, పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండాలని, పరీక్షా సమయాన్ని బట్టి విద్యార్థులకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని, పరీక్షలు జరిగే ప్రాంతాలలో 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పరీక్షా సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఈనెల 18 వ తేదీన ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి తగు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 44 పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో 7523 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్టు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పని చేస్తున్నట్లు సర్టిఫికెట్ తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా( రెవెన్యూ) అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇంటర్మీడియట్ పరీక్షల నోడల్ అధికారి సంజీవ, అధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ : నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 58 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి అని, పరీక్షలకు 16 వేల 854 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరవుతారని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో సన్నాహక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పొలిసు బందోబస్త్, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాల మూసివేతకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి దస్రు నాయక్, జిల్లా ఎగ్జామి నేషన్ కమిటీ సభ్యులు ఎండి.ఇస్మాయిల్,హై పవర్ కమిటీ సభ్యులు సీహెచ్.మల్లా రెడ్డి, పాల్గొన్నారు.