Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంవత్సరం క్రితం ప్రారంభించిన భూ పరిపాలన రంగంలో విప్లవాత్మక మైన ధరణి కార్యక్రమం జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ నల్గొండ జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని ఆయన తెలిపారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్బంగా శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన ,అవాంతరాలు లేని ట్యాంపర్ ప్రూఫ్‌గా ఉందన్నారు. వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన అత్యాధునిక ఆన్ లైన్ పోర్టల్,భూ సంబంధిత లావా దేవీలకు ధరణి వన్‌స్టాఫ్ పరిష్కారంను అందిస్తుందని అన్నారు. ముఖ్య మంత్రి మంచి విజన్‌తో, పారదర్శక మైన రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను తయారు చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన ధరణి సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. గతంలో జిల్లాలో కేవలం కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండగా ధరణి వచ్చాక జిల్లాలోని అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు. స్లాట్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవడంతో పాటు, మ్యుటేషన్ ప్రాసెస్ కూడా వెంటనే పూర్తి అవుతుందన్నారు. జిల్లాలో గడచిన ఏడాది కాలంలో 28700 సేల్స్ లావా దేవీలు, 15373 గిఫ్ట్ డీడ్ లు, 4052 సక్సేషన్ లు,2501 తనఖా లావాదేవీలు జరిగాయని వివరించారు. అలాగే 11873 పెండింగ్ మ్యుటేషన్ లు క్లియర్ చేశామని, 10361 ప్రత్యేక భూ సంబంధిత విషయాలు, 6488 ప్రోహిబిషన్ లిస్ట్ సమస్యలు, 1733 కోర్ట్ కేసులు పరిష్కరించామనీ తెలిపారు. ధరణి లో 31 రకాల మాడ్యుల్ లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని వినియోగించు కొని భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించు కావాలని సూచించారు. నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకతని అన్నారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్ ఉన్నాయి. జిల్లాలో పరిష్కరించబడిన ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయన్నారు. జిల్లాలో పరిష్కరించిన ఫిర్యాదులు 30455కాగా, పెండింగ్ మ్యుటేషన్లు 11873, భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు 10361,నిషేధించబడిన జాబితా 6488, కోర్ట్ కేసులు మరియు సమాచారం 1733 పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో డిపీఆర్వో పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.