Authorization
Thu May 01, 2025 01:39:00 pm
నవతెలంగాణ-పెద్దవూర
జాతీయ సమైక్యతకు క్రీడలు దోహద పడతాయని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తుంగతుర్తి లో తెలంగాణ రాష్ట్ర మహిళా కబడ్డీ క్రీడల ముగింపు కార్యక్రమానికి హాజరై బహుమతులు అందించి మాట్లాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దఢత్వం కలుగుతుందన్నారు. కబడ్డీలో క్రీడాకారులు ఎంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. తుంగతుర్తి లో స్వయం భూమేశ్వర స్వామి ఉత్సవాలు కన్నుల పండువగా జరగగా, అదే రీతిలో రాష్ట్రస్థాయి మహిళా ఓపెన్ టు అల్ కబడ్డీ క్రీడలు నియోజకవర్గ వాసులను కనువిందు చేశాయన్నారు. సర్పంచ్ మెండే విష్ణుప్రియ సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో 14 టీములు పాల్గొనగా వరంగల్ ప్రథమ, నల్గొండ అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. ఈ కార్యక్రమంలో సాగర్ సీఐ గౌరీనాయుడు, మండల అధ్యక్షుడు జటావత్ రవి నాయక్, పీఏసీఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, పొదిల శ్రీనివాస్, జానపాటి లక్షమన్, నడ్డి లక్ష్మయ్య పాల్గొన్నారు.