Authorization
Sun May 04, 2025 01:31:19 am
- నేడు భారీ ర్యాలీ బహిరంగ సభ
- రేపు 400 మందితో ప్రతినిధుల సభ
- పాల్గొననున్న రాష్ట్ర నాయకులు
- ఎరుపుమయమైన కట్టంగూరు
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 19వ జిల్లా మహాసభలు ఈ నెల 19, 20 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలిరోజు సోమవారం కట్టంగూరులో ప్రధాన వీధుల గుండా డప్పుల మేళాలతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు వైవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే బహిరంగ సభలో ముఖ్యవక్తగా రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట రాములు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, మిర్యాల గూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొను న్నారు. మంగళవారం ప్రతినిధుల సభ ప్రారంభం కానుంది. ఈ సభకు 350 మంది ప్రతినిధులు, 50 మంది ఆహ్వానితులు మొత్తం 400 మంది హాజరుకానున్నారు. జిల్లా మహాసభల నేపథ్యంలో కట్టంగూర్ ప్రాంతమంతా ఎరుపుమయమైంది.
రఉద్యమాలను ఉధృతం చేసేందుకు మహాసభ
నారి ఐలయ్య (వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి)
భూమి, కూలి, ఉపాధి, సామాజిక అంశాలపై సాగిన ఉద్యమాలు మరింత ఉధృతం చేసేందుకు ఈ మహాసభ దోహద పడుతుంది. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ కూలీల ఉపాధి హామీ అమలు తీరుతెన్నులు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యకలాపాలు రూపొందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రానున్న మూడేండ్ల కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. దేశానికి అన్నం పెడుతున్న రైతులు, వ్యవసాయ కూలీలు ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని కేంద్ర ప్రభుత్వం సంస్కరణ పేరుతో దెబ్బతీస్తుంది. వ్యవసాయ రంగం దెబ్బతినేలా విద్యుత్ సమస్యల లాంటి చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. 1934లో మహానేత పుచ్చలపల్లి సుందరయ్య నిర్మించిన వ్యవసాయ కార్మిక సంఘం నేడు దేశవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యవసాయ కూలీల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం వ్యవసాయ కార్మిక సంఘమే. భూమిపంచాలి, కూలి పెంచాలి అనే నినాదంతో వ్యవసాయ కార్మికులకు అండగా నిలబడ్డ సంఘం వ్యవసాయ కార్మిక సంఘం. ఈ సంఘం రాష్ట్ర మహాసభలకు అందరూ సహకరించి పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొనాలి.