Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేమ పేరుతో రైతుల నిలువు దోపిడీ
- తడిసి ముద్దవుతున్న వడ్లు
- క్వింటాకు నాలుగు కిలోలు ఇస్తేనే దిగుమతి
- టార్గెట్ అయిపోయిందంటున్న మిల్లర్లు
- నెల గడిచినా కొనుగోలు చేయని అధికారులు
రైతులు రాత్రి అనకా పగలనకా ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతన్నలకు పండిన పంటను మార్కెట్లో విక్రయించాలంటే సమయానికి కొనుగోలు చేయకపోవడంతో దాన్యం రాశుల వద్ద రాత్రిళ్లు పగలు పడిగాపులు కాస్తూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
ఈ ఏడు వర్షాలు సమద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావుల కింద ప్రాజెక్టుల కింద రైతులు వరి సాగు చేశారు ఈ ఏడు కొండమల్లేపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతులు యాసంగి సాగులో మిర్చి, జొన్న, వేరుశనగ పంటల తో పాటు వరి పంటను 6744 ఎకరాల్లో పంట సాగు చేశారు. పంట దిగుబడి రావడంతో దీనికి తోడు ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు 2060 నుంచి 2040 మద్దతు ధర ప్రకటించడంతో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొండమల్లేపల్లి మండలంలో పెండ్లిపాకుల, చింతకుంట్ల ఎక్స్ రోడ్డు, కొండమల్లేపల్లి, సిఏ పల్లి గ్రామాలలో మొత్తం నాలుగు ఐకెపి కేంద్రాలను ఏర్పాటు చేశారు. దిగుబడి వచ్చిన ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందెందుకోసం ఐకెపి కేంద్రాలకు అధిక మొత్తంలో ధాన్యం విక్రయానికి తీసుకురాగా తేమ, తాలు పేరుతో ట్రాన్పోర్ట్ట్ లారీల కొరతతో తూకం వేయకపోవడంతో తూకం వేసిన ధాన్యం రైస్ మిల్లులకు పంపించగా మిల్లర్లు తేమశాతం ఎక్కువ ఉందని బియ్యానికి 68శాతం రావాల్సిన అవుటను 59 నుంచి 60 శాతం మాత్రమే వస్తుందని కొర్రీలు పెడుతూ క్వింటాలకు అదనంగా నాలుగు కిలోల ధాన్యాన్ని కటింగ్ ఇస్తానే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటాము లేదంటే చేసుకోమని మిల్లర్లకు ఇచ్చిన టార్గెట్ పూర్తి అయిందని చెబుతూ ధాన్యం దిగుమతి చేసుకోకుండా రోడ్ల మీదనే లారీలను రోజుల తరబడి ఉంచుతూ మిల్లర్లు రైతుల ధాన్యాన్ని దోచుకుంటూ రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్కో లారీ దిగుమతి కావాలంటే నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుండడంతో లారీ ఓనర్లు క్వింటాల్‌కు రెండు రూపాయలు వెయిటింగ్ చార్జ్ ఇవ్వాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే లారీలను కేంద్రాలకు పంపమని అంటున్నారు. ఇటు లారీల కొరతతో అటు ధాన్యం తేమశాతం పేరుతో అధికారులు కొనుగోలు సక్రమంగా జరపకపోవడంతో తీసుకొచ్చి ధాన్యం వర్షాలకు తడుస్తూ ఎండుతూ నెల రోజులు దాటిన కొనుగోలు చేయకపోవడంతో రైతులు వడ్లను ఆరబోస్తూ వరకు పడాలు లేక ధాన్యం రాశుల వద్ద రైతులు పగలు రాత్రి పడిగాపులు కాస్తు కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. గత పది రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండడంతో తెచ్చిన ధాన్యం ఐకెపి కేంద్రాల్లో పడాలు లేకపోవడంతో తడిసి ముద్దయితు వడ్లు ముక్క పాయ పడుతూ మొలకలు వస్తున్నాయి. కొనుగోలు ప్రారంభించి నెల రోజులు గడిచిన నేటికి అధికారులు 30 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు ఇంకా 70శాతం ధాన్యం కొనుగోలు చేయవలసి ఉంది. రైతుల అవస్థలు పట్టించుకునే వారు లేకపోవడంతో తెచ్చిన ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ఉన్నత అధికారులు చొరవ తీసుకొని పేచీలు లేకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
నెల దాటినా వడ్లు కాంట వేయడం లేదు
రైతు కోడావత్ రామారావు పీలియా తండ
నేను పెండ్లిపాకల ఐకెపి కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చి నెల రోజులు అయింది అయినా అధికారులు ఇక్కడ తెచ్చిన ధాన్యాన్ని పట్టించుకోవడం లేదు. తేమ ఎక్కువ ఉందని తాలు ఉందని చెబుతున్నారు తప్ప ఒక్క అధికారి కూడా వచ్చి వడ్లను పరిశీలించడం లేదు. వందల మంది రైతులకు ఒక్క తుర్పాల మిషన్ మాత్రమే ఉంది. మరికొన్ని వడ్లు తూర్పాల పట్టే మిషన్లను ఏర్పాటు చేయాలి. గోనెసంచులకు పెళ్లి పాకల రైతు వేదికకు పోవాల్సి వస్తుంది. రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులు వెంటనే వడ్లను కొనుగోలు చేయాలి. ఇక్కడ కొనుగోలు చేసిన వడ్లకు మిల్లర్లు కొర్రీలు పెట్టకుండా చూడాలి.
ఈ ఎంకల తొంగి చూస్తలేరు
రైతు వంపు వెంకయ్య చింతకుంట్ల
పెండ్లిపాకల వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి నేను వడ్లు తీసుకువచ్చి 20 రోజులు అయింది. ఇటువైపు ఎవ్వరు వచ్చి వడ్లను చూడడం లేదు. వచ్చిన వడ్లను కొనుగోలు చేయడం లేదు. దీంతో మేము రాత్రి, పగలు కాపలా ఉండలేకపోతున్నాం. గత పది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఒడ్లు ఆరక ముక్కపాయ వచ్చి మొలకలు వచ్చే తట్లుంది దీంతో రైతులం నష్టపోయే ప్రమాదం ఉంది. వెంటనే అధికారులు వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.
లారీల ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంది
రైతు సహకార సంఘం
సీఈవో పల్ల తిరుపతిరెడ్డి
తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుల వద్దకు పంపిస్తే రైస్ మిల్లర్లు తేమ పేరుతో కొర్రీలు పెడుతూ సరైన సమయంలో ధాన్యం బస్తాలను దిగుమతి చేసుకోక పోవడంతో లారీలోని ధాన్యం దిగుమతి కావాలంటే మూడు నుంచి నాలుగు ఐదు రోజుల సమయం పడుతుంది. ఉన్నతాధికారులు మరికొన్ని లారీలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నేటి వరకు 30 వేల క్వింటాళ్ల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. లారీల ట్రాన్స్పోర్ట్ సరైన సమయంలో కేంద్రాలకు వస్తే వీలైనంత త్వరలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.