Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఏడు దశాబ్దాలుగా అంబేద్కర్ తీవ్ర కృషి ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలతో, చదువునూ, విజ్ఞానాన్ని, బతుకు దెరువునూ కొంతలో కొంతయినా పొందిన బడుగులు నేడు ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. అయితే అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన లక్ష్యం ఇంకా చేరువకాలేదు. గత ఆరుదశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలువుతున్నా దళితుల, ఆదివాసీల, వెనకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు తగినంతగా మెరుగుపడలేదు. కుల పీడనకు ఆధారంగా ఉన్న దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కులనిర్మూలనా పోరాటాన్ని మిళితం చేయవలసి ఉన్నది. ఇది మనం అంబేద్కర్ జయంతి రోజున పొందాల్సిన స్ఫూర్తి.
ఆయన పుట్టి నూటాముప్పయి మూడేండ్లు, మరణించి ఏడు దశాబ్దాలు గడిచాయి. కానీ సామాజిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఆయనింకా సజీవంగానే సంచరిస్తున్నాడు. ఈ దేశంలోని అశేష ప్రజానీకపు సమస్యలపై జీవిత పర్యంతమూ పనిచేసిన అమరుడాయన. జ్యోతిబాఫూలే లాంటి సామాజిక విప్లవకారుల అడుగుజాడలో మరింత వేగంగా అడుగులు వేసి, పీడితుల తాడితుల గుండెల్లో వెలుగుదీపమై నేటికీ నిలిచివున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. నిజంగా అతనో గొప్ప మేధావి. న్యాయశాస్త్ర కోవిదుడు. భారతదేశం గర్వించదగిన నాయకుడు. మన రాజ్యాంగ రూపకల్పన చేసిన మార్గనిర్ధేశకుడు.
చిన్నతనంలోనూ, చదువుకునే రోజుల్లోనూ అంబేద్కర్ అంటరానివారు అనుభవించే అవమానాలను తానూ అనుభవించాడు. ఆ అనుభవాలే ఆయనలో మరింత పట్టుదల పెంచాయి. కుల వ్యవస్థ నిర్మూలన కోసం నిరంతరం శ్రమింప జేశాయి. సాహు మహరాజ్ మొదలైనవారి సహకారంతో లండన్, కొలంబియాలలో ఆర్థిక, రాజకీయ, న్యాయశాస్త్రాలను అధ్యయనం చేసి మేధస్సుకు పదునుపెట్టాడు. గాంధీజీ నాయకత్వంలో దేశంలో అంటరానితనం నిర్మూలన కోసం తీవ్రంగా కృషిచేసినప్పటికీ, ఆ సమస్యకు మూలమైన హిందూ చాతుర్వర్ణ వ్యవస్థ వర్ణాశ్రమ ధర్మాన్ని పవిత్రంగానే చూడటాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు. 1927లోనే మనుస్మృతిని వేలాది మంది దళితుల సమక్షంలో దహనం చేశారు. అస్పృశ్యులలో చైతన్యాన్ని పెంపొందించి, వారిలో గల బానిస ప్రవృత్తిని నిర్మూలించేందుకు, మానవ హక్కుల కోసం, సమానత్వం కోసం వారు పోరాడేటట్లు నిర్విరామంగా కృషి చేశారు. ఛాందసవాదులను ధిక్కరించాడు. మహద్ చెరువులో నీరు తాగే హక్కు కోసం, దేవాలయ ప్రవేశం కోసం నాసిక్‌లో పోరాటానికి అంబేద్కర్ నాయకత్వం వహించాడు. గుడిలోకి ప్రవేశాన్ని, చెరువులో నీళ్లు తాగే స్వేచ్ఛనూ నిరాకరిస్తున్న హిందూమతంపై విశ్వాసాన్ని కోల్పోయాడు. 'మతబోధకులూ, మతావలంబకులు కేవలం దేవుడికి మనుష్యులకు ఉండే సంబంధాలను గురించి మాత్రమే ప్రస్తావిస్తారు. కానీ మనుష్యుల మధ్య ఉండవలసిన సంబంధాలను గురించి వారు చెప్పరు' అని నిలదీస్తాడు. హిందూ మతంలోని వివక్షతలను, మూఢ విశ్వాసాలను, అన్యాయా లను బహిరంగ పరచి ఎండగట్టారు. మనుధర్మ శాస్త్రాన్ని, మన రాజ్యాంగానికి మారుగా నేడు ప్రచారంలోకి తెస్తున్న హిందూత్వవాదుల కుటిల పన్నాగాలను అంబేద్కర్ స్ఫూర్తితో నేడు మనం తిప్పికొట్టాల్సివుంది.
ఇక రెండో విషయం నేటి పాలకులు ఆర్థికపరంగా, సామాజికపరంగా అంబేద్కర్ ఆలోచనలకు, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఆనాడు అంబేద్కర్ 'రాష్ట్రాలు- మైనార్టీలు' అన్న రచనలో ఇలా చెబుతారు... ''మౌలికమైన, కీలకమైన పరిశ్రమ లన్నింటినీ, ఇన్సూరెన్స్‌ను, సాగుకు అనుకూలంగా ఉన్న భూములను ప్రభుత్వం వశం చేసుకోవాలి. పేదరైతులకు, భూమిలేని వ్యవసాయ కార్మికులకు పంచాలి, సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు నెలకొల్పాలి. సవర్ణ హిందువుల నుండి మైనార్టీలకు తగు రక్షణలను కల్పించాలని'' కోరారు. అందువల్లనే ప్రముఖ దళిత మేధావి రావు సాహెబ్ కాస్బే అంబేద్కర్ గురించి చెబుతూ... 'ప్రపంచ చరిత్ర అంతా వర్గ సమాజ చరిత్రే. ఇందుకు ఇండియా మినహాయింపు ఏమీకాదు.'' అయితే ''వర్గంలోనే కులం కూడా ఇమిడివున్నది'' అని అంబేద్కర్ దేశంలోని వర్గ వ్యవస్థ మూలాన్ని గురించిన వివరణలో పేర్కొనడాన్ని కాస్బే వివరిస్తారు. అంటే బుద్ధుని ''దుఃఖం'' అన్నదానిని దోపిడీతో సమాన అర్థంగా భావించారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలోని అత్యధిక పేదలు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, అస్పృశ్యకులాలుగానే ఉన్నారు. దోపిడీ పీడనకు గురవుతున్న వారూవారే. అందుకనే ఇప్పుడు దోపిడీ, కుల పీడనలకు వ్యతిరేకంగా జమిలిగా పోరాడవలసిన అవసరం ఉందని, నేడు వామపక్షాలు భావిస్తున్నాయి. ఆచరణలోను అడుగులేస్తున్నాయి.
గత ఏడు దశాబ్దాలుగా అంబేద్కర్ తీవ్ర కృషి ఫలితంగా ఏర్పడిన రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలతో, చదువునూ, విజ్ఞానాన్ని, బతుకు దెరువునూ కొంతలో కొంతయినా పొందిన బడుగులు నేడు ప్రశ్నించే స్థాయికి ఎదిగారు. అయితే అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన లక్ష్యం ఇంకా చేరువకాలేదు. గత ఆరుదశాబ్దాలుగా రిజర్వేషన్లు అమలువుతున్నా దళితుల, ఆదివాసీల, వెనకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు తగినంతగా మెరుగుపడలేదు. కుల పీడనకు ఆధారంగా ఉన్న దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కులనిర్మూలనా పోరాటాన్ని మిళితం చేయవలసి ఉన్నది. ఇది మనం అంబేద్కర్ జయంతి రోజున పొందాల్సిన స్ఫూర్తి.