Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి ఉపయుక్తమైన జీవ పరిణామ క్రమాన్ని పాఠ్యాంశంగా తొలగిస్తే భావి మస్తిష్కాకాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏం చెబుతారు? నిస్సందేహంగా తిరిగి మతాన్ని, దైవత్వాన్ని ముడి పెడతారు. నేటి సాంకేతిక యుగంలో ఈ వాదనలను పౌరసమాజం ఖండించాలి. శాస్త్ర ప్రగతిని భావి తరాలకు అందించాలి. నూతన దృక్కోణ సమాజాన్ని ఆవిష్కరించాలి.
''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ప్రపంచమంతటిదీ ఒక దారైతే బీజేపీ నేతలది మరోదారి. శాస్త్ర సాంకేతికాభివృద్ధితో ప్రపంచమంతా పురోగమనానికి బాటలు వేసుకుంటుంటే... మన పాలకులు మాత్రం ఏ రుజువులూ లేని పురాణాలూ, విశ్వాసాల ఆధారంగా దేశాన్ని తిరోగమన బాట పట్టిస్తున్నారు. ఒక మాతృక నుండి సకల జీవరాశులు క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయన్న సత్యాన్ని తెలిపే డార్విన్ సిద్ధాంతం వైజ్ఞానిక ప్రపంచంలోనే ఓ అద్భుత ఆవిష్కరణ. అటువంటి శాస్త్రీయ సిద్ధాంతాన్ని పదో తరగతి పాఠ్యప్రణాళిక నుంచి కేంద్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) చేరిపేస్తోంది. 'విశ్వవ్యాప్తంగా విస్తృత ఆమోదం పొందిన డార్విన్ మేధోశ్రమ ఏ ప్రాతిపదికన దేశీయ చదువులకు నిరర్థకమని ఎన్సీఈఆర్టీ నిర్థారించింది?' అని టీఐఎఫ్ఆర్, ఐఐఎస్ఈఆర్, ఐఐటీలకు చెందిన 1800మందికి పైగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. రుజువుకు నిలబడేది సైన్స్. అందుకే ఆనాడు మతవాదుల తిరస్కరణకు గురైన కోపర్నకస్ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతం కావచ్చు, గెలీలియో కనిపెట్టిన టెలిస్కోపు కావచ్చు... రుజువుకు నిలబడి ప్రపంచానికే వెలుగులు నింపుతున్నాయి. శాస్త్రీయ దృక్పథం లోపించిన గర్హనీయమైన ఏకపక్ష నిర్ణయాలతో కేంద్ర పాలకులు పాఠ్య పుస్తకాల్లో ఇష్టారీతిన మార్పులు చేస్తూ భావి భారతాన్ని అజ్ఞానాంధకారంలోకి నెడుతున్నారు!
పాఠశాల విద్యలో గుణాత్మక మార్పుకు దోహదపడటమే ప్రధాన లక్ష్యంగా... కులమతాలకు అతీతంగా మానవతా విలువలకు పట్టంకట్టే 'వాల్యూ ఎడ్యుకేషన్'ను స్వప్నించింది ఎన్సీఈఆర్టీ. కానీ, నేడు అదే ఎన్సీఈఆర్టీ చరిత్ర, రాజనీతి, సామాజిక శాస్త్రాల పాఠ్యపుస్తకాల్లో తలపెడుతున్న అహేతుక మార్పులు విద్యావేత్తలను, మేధావులను నిర్ఘాంతపరుస్తున్నాయి. ఈ అనుచిత మార్పులు నాణ్యమైన విద్యా పునాదుల్లేని నవతరాన్ని తయారుచేస్తాయనడంలో సందేహంలేదు. అసత్యాలు, అర్ధసత్యాల్నే పాఠాలుగా నిర్ణయిస్తే సమకాలీన ప్రపంచంతో మన పిల్లలు ఎలా పోటీ పడగలరు? దేశ భవితకు చుక్కానులుగా ఎలా ఎదుగుతారు? అన్నవి ఎప్పటికీ జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోకూడదు.
ఆనాటి మతగ్రంథాలు, సాంప్రదాయవాదులు ఎంతగా వ్యతిరేకించినా, డార్విన్ సిద్ధాంతం జీవులను అవగాహన చేసుకోవడంలో గొప్ప విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. అదే విధంగా ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం జీవుల పుట్టుక, పరిణామంపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను నిలువరించడంలో కీలక పాత్ర పోషిస్తూ శాస్త్రీయ ఆలోచనలకు పునాది వేసింది. కానీ, పాలకవర్గం పలు వేదికల ద్వారా భారత శాస్త్ర విజ్ఞానంతో పాటు ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికే వక్రభాష్యం పలుకుతోంది. గతంలో జరిగిన జలంధర్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రముఖ విశ్వవిద్యాలయ వీసీ నాగేశ్వరరావు డార్విన్ సిద్ధాంతానికి మతానికి ముడిపెట్టారు. ఐదేండ్ల క్రితం అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌సింగ్ డార్విన్ సిద్ధాంతం తప్పని, దీనిని సైన్స్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించాలన్నారు. ఇలాంటి అసత్య, సూడో సైన్స్ వాదనలతో శాస్త్రీయతను అపహాస్యం చేస్తుంటే మన దేశ ప్రగతి ఎటు పోతుందో అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అనేక పరిశీలనల్లో రుజువైన ఈ సిద్ధాంతంపై ప్రపంచంలో మతం,మతవాదులు దాడిచేస్తూనేవున్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా పరిణామం కాదు, దైవసృష్టే అని నమ్మేవారున్నారు. కాని ఆయా దేశాలలో పాలకులు మాత్రం సైన్స్‌కే పట్టం కడుతున్నారు. ఆధునిక ప్రపంచం సాధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని కాదని, మానవాళి ఆవిర్భావాన్ని పురాణాల్లో వెతికితే ఏం తెలుస్తుంది..? తద్వారా ఏ ప్రయోజనం సాధించాలనీ..!? ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని శాస్త్రీయ విజ్ఞానానికి, శాస్త్రీయ భావాలకు దూరంగా ఉంచాలనుకుంటున్నారా..? తిరిగి మధ్య యుగాల్లోకి నడిపించాలనుకుంటున్నారా..? అని యావత్ శాస్త్ర ప్రపంచం ఈ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇది శాస్త్రీయ సమాజానికే అవమానమని నిరసిస్తోంది. ఒక వైపు కేంద్ర పాలకులు ఆధునిక సమాజ నిర్మాణం, సైన్సు, టెక్నాలజీ అని ఊదరగొడుతూనే ఇలా సైన్సుపై దాడి చేస్తుడటం దేనికి దారితీస్తుంది..? ఆధునిక సమాజానికా? ఆటవిక సమాజానికా?
శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి ఉపయుక్తమైన జీవ పరిణామ క్రమాన్ని పాఠ్యాంశంగా తొలగిస్తే భావి మస్తిష్కాకాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏం చెబుతారు? నిస్సందేహంగా తిరిగి మతాన్ని, దైవత్వాన్ని ముడి పెడతారు. నేటి సాంకేతిక యుగంలో ఈ వాదనలను పౌరసమాజం ఖండించాలి. శాస్త్ర ప్రగతిని భావి తరాలకు అందించాలి. నూతన దృక్కోణ సమాజాన్ని ఆవిష్కరించాలి.