Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రా.. ధర్మయుద్ధం చేద్దాం రా... నాకు నైతికత ఉంది కానీ అధికారం లేదు... నీకు అధికారం ఉంది కానీ నైతికత లేదు.... నువ్వు నా పుర్రె పగులగొట్టొచ్చు... నేను పోరాడుతాను నువ్వు నా ఎముకలు విరగ్గొట్టొచ్చు... నేను పోరాడుతాను తుది శ్వాస విడిచేదాకా సత్యం అండతో నేను పోరాడుతాను నీ అబద్దాల కోట బద్దలు కొట్టేదాకా నేను పోరాడుతాను'' అంటున్నారు. ఆ స్ఫూర్తే కావాలిప్పుడీ దేశానికి. అప్పుడే న్యాయానికి రక్షణ.
''న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే గానీ
గెలిచేదంతా న్యాయం కాదు'' అంటాడు శ్రీశ్రీ. ఇప్పుడు గుజరాత్లో జరుగుతున్న వరుస పరిణామాలు శ్రీశ్రీ మాటల్లోని సారాన్ని, సత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గుజరాత్ మతకలహాల్లో బిల్కిస్ బానో ఉదంతంలో కిరాతకానికి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న దోషులందరినీ క్షమాభిక్ష పేరుతో విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. దీనిపై వెల్లువెత్తిన విమర్శలూ నిరసనలూ ఇంకా సమసిపోనేలేదు. అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. ఒకవైపు పౌర సమాజంలో, మరోవైపు న్యాయస్థానంలో ఈ వివాదం కొనసాగుతుండగానే నరోదాగామ్లో జరిగిన మరో ఘాతుకంలో కూడా దోషులకు తాజాగా క్లీన్చిట్ లభించింది. ఈ కేసుతో పాటు 97మందిని ఊచకోత కోసిన నరోడా పాటియా కేసులోనూ దోషిగా తేలి, 28ఏండ్ల జైలుశిక్ష విధించబడిన నాటి గుజరాత్ మంత్రి మాయకొద్నానీతో సహా మరో 68 మందిని అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీజేపీ అగ్రనేత అమిత్‌షా కోర్టుకు హాజరై దోషులకు అనుకూలంగా సాక్ష్యమిచ్చారు.
ఈ రెండు ఉదాంతాలూ 2002లో గుజరాత్లో చెలరేగిన మత కలహాలలో భాగాలే. అయితే, మొదటి ఉదంతంలో 11మంది దోషుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సుప్రీంకోర్టు తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగిస్తుండగా, రెండవ ఉదంతంలో అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఒక్కసారి రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే... భారతీయ సహజీవన స్ఫూర్తికే విఘాతం కలిగించిన మానని గాయంగా ఈ మారణ హౌమం మనలను వేదనకు గురిచేస్తుంది. రెండు మూడు నెలల పాటు గుజరాత్‌ను అట్టుడికించిన ఈ అరాచక పర్వంలో అధికారిక లెక్కల ప్రకారమే పదకొండు వందల మందికి పైగా హత్య కావించబడ్డారని నానావతి కమిషన్ స్పష్టం చేసింది. కన్సంట్ సిటిజన్ ట్రిబ్యునల్ రిపోర్టు ప్రకారం రెండువేల హత్యలు జరిగాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు, లక్షలాది మంది గుజరాత్‌ను వీడి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయ మూర్తులతో కూడిన ఈ ట్రిబ్యునల్ తన సుదీర్ఘ విచారణ తరువాత ''క్రైమ్ అగెనెస్ట్ హ్యూమానిటీ'' పేరుతో తన నివేదికను వెల్లడించింది. గుజరాత్ ప్రభుత్వమే ఈ అల్లర్లకు అవకాశమిచ్చిందా? అనే అనుమానాలనేకం ఇందులో వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రే ఇంతటి అమానవీయ హింసకు సహకరిస్తే, ఆయన క్యాబినెట్ మంత్రులే స్వయంగా హింసను ప్రేరేపించారని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ నేరాలను ప్రభుత్వమే అనుమతించిందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరిస్తూ... నివేదిక అనేక ఉదాహరణ లిచ్చింది.
ఈ హింసోన్మాదం వెనుక గుజరాత్‌లోనే కాదు, మొత్తం దేశంలోనే ఒక స్పష్టమైన మత సమీకరణను, విభజనను సృష్టించడం ద్వారా అధికారాన్ని స్వంతం చేసుకోవాలనే రాజకీయ కుట్ర ఉందని కూడా అప్పట్లో అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే నిజమయ్యాక దోషులందరూ ఒక్కరొక్కరుగా విడుదలవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే విడుదలవుతున్న దోషులందరూ అధికార పార్టీ వారి సన్మానాలు సత్కారాలు అందుకోవడమే కాదు, నేరుగా పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా నిర్దోషులుగా ప్రకటించబడిన వారిలో మాయ కొద్నాని నాటి గుజరాత్ ప్రభుత్వంలో మంత్రికావడం, ఆమె తరఫున స్వయంగా అమిత్‌షానే సాక్ష్యమివ్వడం గమనార్హం!
ఒకవైపు ఇలా దోషులందరూ ఒకరి తరువాత ఒకరు విడుదలవుతుండగా వాస్తవాలకు కట్టుబడి ప్రజాపక్షం వహించిన తీస్తా సెత్వాద్ లాంటి హక్కుల కార్యకర్తలు మాత్రం తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. మరికొందరు కటకటాల్లో మగ్గుతున్నారు. అలాంటి వారిలో ఒకరు సంజీవ్‌భట్. ఈయన ఎంత నిజాయితీగల పోలీసు అధికారో తన ట్రాక్రికార్డు చూస్తే అర్థమవుతుంది. కానీ ఆయన ఇప్పుడు ఓ జైలుపక్షి. రక్తపుటేరులై పారిన గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టులో ఆయన ఓ అఫిడవిట్ దాఖలు చేయడమే నేరమైందో ఏమో...! ఆ తరువాత ఆయన అనేక ఆరోపణలకు గురై సర్వీసు నుంచి తొలగించబడటమే గాక, యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయినా ఆయన వెరవట్లేదు...
''రా.. ధర్మయుద్ధం చేద్దాం రా...
నాకు నైతికత ఉంది కానీ అధికారం లేదు...
నీకు అధికారం ఉంది కానీ నైతికత లేదు....
నువ్వు నా పుర్రె పగులగొట్టొచ్చు... నేను పోరాడుతాను
నువ్వు నా ఎముకలు విరగ్గొట్టొచ్చు... నేను పోరాడుతాను
తుది శ్వాస విడిచేదాకా సత్యం అండతో నేను పోరాడుతాను
నీ అబద్దాల కోట బద్దలు కొట్టేదాకా నేను పోరాడుతాను'' అంటున్నారు. ఆ స్ఫూర్తే కావాలిప్పుడీ దేశానికి. అప్పుడే న్యాయానికి రక్షణ.