Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత కొద్ది సంవత్సరాలుగా చైనాలో పెరిగిన వేతనాల కారణంగా
వెలుపలికి పోయిన సంస్థలు వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలకు
వెళ్లాయి తప్ప మన దేశానికి వచ్చిన దాఖలా లేదు. ఫోర్డు వంటి సంస్థలు
కొన్ని మన దేశంలోని దుకాణాలను మూసుకున్నాయి. మేకిన్ ఇండియా,
మేడిన్ ఇండియా పిలుపులు, ప్రోత్సాహకాలను ఎవరూ పట్టించుకోలేదు.
అందరికీ పని కల్పించే, గౌరవ ప్రదమైన వేతనాలను ఇస్తే తప్ప దేశంలో,
ఉపాధి, డిమాండ్ పెరగదు.
జనాభాలో భారత దేశం చైనాను అధిగమించనుందని ఐరాస జనాభా నిధి విభాగం ప్రకటించింది. అనేక మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చాయి. ఇదే వార్త మీద చైనా మీడియా స్పందన భిన్నంగా ఉంది. భారత్ అగ్రస్థానంలోకి వచ్చిన అంశాన్ని సాకుగా తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పశ్చిమ దేశాల మీడియా మండిపడింది. ఐరాస అంచనా ప్రకారం ఈ ఏడాది మధ్యనాటికి మన దేశ జనాభా 142.86కోట్లు, చైనాలో 142.57కోట్లుగా పేర్కొన్నది. ఇరవైతొమ్మిది లక్షల మంది మనవారు ఎక్కువగా ఉంటారు. నిజానికి దీని గురించి జనవరిలోనే కొన్ని సంస్థలు విశ్లేషణలు ఇచ్చాయి. వాస్తవానికి తైవాన్ ఇప్పుడు వెలుపల ఉన్నా అది కూడా చైనాలో భాగంగా చూస్తే ఇప్పటికిప్పుడు మరో రెండున్నర కోట్లు అధికంగా ఉంటుంది. తమ జనాభా తగ్గటం గురించి ఎక్కువగా చెప్పిన పశ్చిమ దేశాల విశ్లేషకులు అభివృద్ధిని చూడకుండా విస్మరించారని చైనా స్పందించింది. రాసి కాదు చూడాల్సింది వాసిని అన్నట్లుగా తమ దగ్గర నిపుణులైన పనివారు ఎందరున్నారో చూడాలని పేర్కొన్నది. అధిక జనాభా వలన కలిగే లబ్దిని చైనా కోల్పోయిందని, ఇక భారత్ యుగం ప్రారంభమైందని కొందరు చిత్రించారు. ఐరాస నివేదికను చూపి తమ దేశాన్ని ఒంటరిపాటు చేసేందుకు పూనుకున్నారని చైనా విశ్లేషకులు పేర్కొన్నారు. గడిచిన ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా గతేడాది చైనా జనాభా తగ్గినపుడే అది రెండవ స్థానంలోకి వెళ్లనుందని స్పష్టమైంది. అప్పటి నుంచి మన దేశాన్ని మునగచెట్టు ఎక్కించేందుకు పశ్చిమ దేశాలు పూనుకున్నాయి.
ఐరాస అంచనా ప్రకారం 2060 నుంచి భారత్ జనాభా తగ్గటం ప్రారంభం అవుతుంది. సంఖ్యరీత్యా 2100 నాటికి మన జనాభా 150కోట్లు దాటితే చైనా జనం 77కోట్లకు తగ్గుతారు. జనాభా పెరుగుదల తగ్గనుందని కొన్ని సంవత్సరాల క్రితమే అంచనాకు వచ్చిన చైనా ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు ఎక్కువగా ఇస్తామని చెబుతుండగా మన దేశం జనాభాను అదుపు చేసేందుకు 2019లో ఒక బిల్లును తెచ్చి దాని మీద విమర్శలు తలెత్తటంతో వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం పని చేసే వయస్సులో ఉన్న వారు మన దేశం కంటే చైనాలో స్వల్పంగా తక్కువ మంది ఉన్నారు. జనాభా ఎక్కువగా ఉండటాన్ని అనుకూలంగా మార్చు కోవాలని చెప్పేవారిని ఎవరూ తప్పుపట్టటం లేదు. చైనా అలాంటి అవకాశాన్ని వినియోగించుకొని ఎంతో లబ్ది పొందింది. భారత్ కూడా చైనాతో పోటీపడి ఎగువకు రావాలని, జనజీవితాలు బాగుపడాలని అందరం కోరుకోవాలి. అమెరికా వారి మాదిరి అగ్రస్థానం తమకే ఉండాలి, మిగిలిన దేశాలన్నీ తమకు లొంగి ఉండాలని కోరుకుంటే తప్పు. ఇక్కడ ప్రశ్న జనాభాతో మన దేశం ఇంతవరకు అలాంటి అవకాశాన్ని ఉపయోగ పెట్టుకోకుండా అడ్డుకున్నది ఎవరు?
వృద్ధులు భారంగా మారుతున్నారు, సమస్య తీవ్రంగాక ముందే మేలుకోవాలి అనే పేరుతో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ మీద మన దేశంలో దాడి ప్రారంభించారు. చైనాలో అలాంటిదేమీ లేకపోగా వృద్ధుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు.ఏ దేశంలోనైనా పనిచేయగలిగిన వయస్సులో ఉన్న వారిని కార్మిక లేదా శ్రమశక్తి అని పిలుస్తారు. సిఇఐసి సమాచారం ప్రకారం 2011 చైనాలో వారి భాగస్వామ్యం అంటే పనిచేస్తున్నవారు 70శాతంపైగా ఉంటే 2021నాటికి అది 68.57శాతంగా ఉంది. ఇదే కాలంలో మన దేశంలో 54 నుంచి 2022లో 41శాతానికి పడిపోయింది. 2018లో 36.9శాతానికి దిగజారింది. అందుకే నరేంద్రమోడీ 2019 ఎన్నికలకు ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాల ప్రకటన ఆశ చూపారు. వృద్ధులు భారంగా మారినట్లు ప్రభుత్వమే కాదు, మన సమాజం కూడా భావిస్తున్నది. ఆర్థికవేత్తలు చెబుతున్నదాన్ని బట్టి వృద్ధుల కంటే పనికి దూరంగా ఉండే శ్రామికశక్తి అసలు సమస్య. చైనాలో 60శాతం మహిళా శక్తి ఉత్పత్తి రంగంలో ఉంటే మన దేశంలో కేవలం 22శాతమే ఉన్నారు. అందువలన జనాభాలో మనం చైనాను అధిగమిస్తే ఒరిగేదేమిట,ి జరిగేదేమిటి? అన్న పద్ధతుల్లో చర్చ జరుగుతోంది. గత కాంగ్రెస్, వర్తమాన నరేంద్రమోడీ ఏలుబడి తీరు తెన్నులను చూసిన వారెవరికీ చైనా ప్రపంచ ప్యాక్టరీ మూతపడి భారత్లో తెరుచుకుంటుందని విశ్వాసం కలగటం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా చైనాలో పెరిగిన వేతనాల కారణంగా వెలుపలికి పోయిన సంస్థలు వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వెళ్లాయి తప్ప మన దేశానికి వచ్చిన దాఖలా లేదు. ఫోర్డు వంటి సంస్థలు కొన్ని మన దేశంలోని దుకాణాలను మూసుకున్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులు, ప్రోత్సాహకాలను ఎవరూ పట్టించుకోలేదు. అందరికీ పని కల్పించే, గౌరవ ప్రదమైన వేతనాలను ఇస్తే తప్ప దేశంలో, ఉపాధి, డిమాండ్ పెరగదు. లేకపోతే ఇప్పటి నుంచి ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశమేది అనే ప్రశ్నకు భారత్ అనే ఒక మార్కు ప్రశ్నకు సమాధానం రాసుకోవటం తప్ప అగ్రస్థానం వలన ప్రయోజనం ఉండదు.