Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్వేష,మత రాజకీయాలతో దేశంలో పరిపాలన సాగిస్తున్న బీజేపీ నియంతృత్వానికి దక్షిణాదిన చావుదెబ్బ తగిలింది. కర్నాటకను ఆధారం చేసుకుని దక్షిణాదిన విస్తరిద్దామనుకున్న కాషాయపార్టీ భారీ ఓటమిని చవిచూసింది.అయితే లౌకికవాద స్ఫూర్తితో కన్నడ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ అధికారాన్ని 'చే'జిక్కించుకుంది. ఇంత పెద్దఎత్తున పరాజయం పాలవడం బీజేపీ కేంద్రనాయకత్వానికి మింగుడుపడని అంశం. బలాబలాలు, ఎత్తుగడలు, వ్యూహాలు ఒక ఎత్తయితే అంతకుమించి హిందూమతోన్మాదం పేరుతో రెచ్చగొడుతున్న బీజేపీకీ ఈ ఓటమి చెంపపెట్టు లాంటింది. సర్వేలు, అంచనాలతో రాష్ట్రం చేజారిపోతుందని గ్రహించి మోడీ, అమిత్‌షా, నడ్డా లాంటి ప్రముఖులు ప్రచారం చేసినా ఓటర్లు కాంగ్రెస్‌వైపే మొగ్గారు. ఇక్కడ హింసా, విద్వేషాలకు తావులేదని తేల్చిచెప్పారు కన్నడిగులు.
అయితే బీజేపీ తాను తీసుకున్న గోతిలోనే తానే పడింది. ఆ పార్టీ నిర్ణయాలే ఓటమిని దరిచేర్చాయి. ప్రచార కాలమంతా కూడా మత, విద్వేషాలతోనే సాగింది. ఈవీఎం నొక్కి ఓటు వేసేటప్పుడు గట్టిగా 'జై భజరంగభళి' అనాలని స్వయంగా ప్రధానియే ఓటర్లను పిలుపునివ్వడమంటే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే. 'కేరళ స్టోరీ' పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని చేసిన మంత్రాంగం కూడా ఫలించలేదు. దీనికితోడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ టెర్రరిస్టులతో కలిసి పని చేస్తోందని, అది గెలిస్తే అల్లర్లు జరుగుతాయని, ఇండియా మరో పాకిస్థాన్ అవుతుందని చేసిన విద్వేష ప్రచారం ప్రజల్లో పెనుదుమారం రేపింది. ఈ విద్వేష ప్రకటనలు, చర్యలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు ఫిర్యాదులు చేసినా ఎలక్షన్ కమిషన్ విస్మరించింది. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయాలనే నిర్ణయంతో ఎన్నికల ముందు బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించింది.ఈ చర్య భిన్నత్వంలో ఏకత్వంలా ఉన్న హిందూ, ముస్లింలను రెచ్చగొట్టడమే కదా! రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో బీజేపీ ప్రభుత్వం అనవసర కేసులు, ఇతర ప్రతీకార చర్యల ద్వారా పౌర సమాజ గొంతులను నొక్కడానికి అన్నివిధాలుగా ప్రయత్నించింది. హిందూత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు నటుడు చేతన్ కుమార్‌ను అరెస్టు చేసింది. అతని ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఒసిఐ) కార్డును రద్దు చేసింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ కోర్టు తీర్పుతో లోక్‌సభ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. రాహుల్ విషయంలో న్యాయస్థానం, లోక్‌సభ సెక్రెటరీ, స్పీకర్ శీఘ్ర నిర్ణయాలు తీసుకోవటం బీజేపీకే బెడిసి కొట్టింది. ప్రచార సమయంలో అదానీ అవినీతి సమస్యపై మోడీ మౌనం నిరాటంకంగా కొనసాగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం '40 పర్సంటేజీ సర్కారు' అన్న ప్రతిపక్షాల ప్రచారం జనాల్లో బలంగా నాటుకు పోయింది. ఇంకా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఇన్కమ్ ట్యాక్స్ (ఐటి) డిపార్ట్మెంట్, ఇతర కేంద్ర ఏజెన్సీల ద్వారా ప్రతిపక్షంతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం నిరాటంకంగా కొనసాగింది. ఈ సంస్థల కీలక పదవులకు ఎంపికైన వ్యక్తులు సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సందర్భాలు అనేకం. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రజా ప్రభుత్వమైన ఢిల్లీ, వర్గ చీలికతో సంక్షోభంలో మునిగిన మహారాష్ట్రల పట్ల గవర్నర్ల సహాయంతో కేంద్రం వ్యవహరించిన తీరు కూడా విద్యావంతుల్లో ఆలోచన కలిగించింది. అజ్ఞాత ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులను బీజేపీ పెద్దఎత్తున కుమ్మరించింది. ఈ రకమైన ఎలక్టోరల్ బాండ్ల రాజ్యాంగ బద్ధత సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేస్తూనే ఉన్నది.
ఇద్దరు ప్రముఖ నేతలు కర్నాటకలో 'డబుల్ ఇంజిన్ సర్కార్' ప్రాముఖ్యతపై పాఠాలు చదువుతుండగా, మణిపూర్‌లో 'లా అండ్ ఆర్డర్'కు ఆటంకం ఏర్పడింది. అక్కడి వర్గాల మధ్య రగిలిన చిచ్చుకు బీజేపీనే ఆజ్యం పోసింది. ఈ చిచ్చులో 60మందికి పైగా అధికారికంగా ప్రాణాలు కోల్పోయిన మోడీ, షా పట్టించుకోలేదు. అక్కడ రాష్ట్రం దగ్ధమవుతుంటే ఇక్కడ వారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో హింసాకాండ పెరిగి 35వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడుల కారణంగా భారతసైన్యానికి చెందిన ఐదుగురు స్పెషల్ ఫోర్సెస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రచారంలో మునిగిన మోడీ వారి మరణాలను గుర్తించకపోవడం వారి అధికార దాహానికి మచ్చుతునక. అన్నిటికీ మించి బీజేపీ ప్రభుత్వం అనుసరించిన అవినీతి, ప్రజాస్వామిక విధానాలు, కన్నడ ప్రజల ఆగ్రహానికి గురైనాయి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మత విద్వే షాలు లేకుండా ప్రజా సమస్యలు తీసుకునే పార్టీలు, నాయకులు ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా, లౌకిక వాద స్ఫూర్తితో ముందుకెళ్తే గనుక విజయం వారి వెంటే ఉంటుందని నిరూపించారు కన్నడ ప్రజలు. హ్యాట్సాప్ టూ కర్నాటక.