Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి గతంలో
చెప్పిన ఈ మాట అక్షర సత్యం. అందుకే 'నిరుద్యోగం' అనే పెద్ద గొయ్యి
రాష్ట్రంలో ఉందనీ, దాన్ని పూడ్చాలనీ నేతలందరికీ తెలుసు. కానీ దాన్ని
పూడిస్తే తర్వాతి ఎన్నికల్లో వారికి చెప్పుకోవటానికి ఏమీ మిగలదు.
అందుకే 'ఆ గొయ్యి...' అలాగే ఉండాలని వారు కోరుకుంటారు. మరి
దాన్ని పూడ్చాలంటే, పాలక పార్టీల మెడలు వంచి గొయ్యిని పూడ్చేలా
చేయాలంటే ఎలాంటి పోరాటాలు నిర్వహించాలనేది తెలంగాణ
యువతరం, ఇక్కడి నిరుద్యోగులే తేల్చుకోవాలి.
''అందరూ శాఖాహారులే... కానీ రొయ్యలబుట్ట మాత్రం మాయమైంది'' అన్న చందంగా ఉంది మన నేతల తీరు! ఇప్పుడు అన్ని పార్టీలూ, వాటి నేతలందరూ జనానికి హామీల మీద హామీలు గుప్పించేవారే... కానీ విచిత్రమేమంటే వాటిలో ఏ ఒక్కటీ ఆచరణలో నెరవేరదు! తెలంగాణలోని నిరుద్యోగులను ఇప్పుడు కలవరపెడుతున్న అంశమిదే. బీజేపీ, కాంగ్రెస్ మొదలుకుని బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్టీపీ వరకూ... చివరికి బీఎస్పీ, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలకు కూడా ప్రస్తుతం రాష్ట్రంలోని నిరుద్యోగులే ఏకైక అజెండా. వారే ఆయా పార్టీలకు అణ్వస్త్రాలు.. అణ్వాయుధాలు. 'మేం అధికారంలోకొస్తే నిరుద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం..' అనటం అన్ని పార్టీలకూ ఆనవాయితీగా మారింది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా 'యూత్ డిక్లరేషన్...' పేరుతో కాంగ్రెస్ ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామంటూ పీసీసీ అధ్యక్షుల వారు నొక్కి వక్కాణించారు. ఇక్కడ చిత్ర విచిత్రమేమంటే... 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని అత్యధిక కాలం ఏకఛత్రాధిపత్యంగా ఏలింది ఈ హస్తం పార్టీయే కదా. అలాంటప్పుడు ఈ 'నిరుద్యోగ భారతానికి...' అసలు సిసలు కారకులెవరనే దానికి ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుంది..? అలాంటప్పుడు తెలంగాణలోని నిరుద్యోగులు ఆ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మగలరా..? అనేది ప్రశ్నార్థకం.
ఇక 'దేశం కోసం' ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మటం... మత పిచ్చి లేపి పబ్బం గడుపుకోవటమే 'ధర్మం'గా భావించే కాషాయ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు విని 'మేధావులు.. విజ్ఞులు' సొమ్మసిల్లి పడిపోతున్నారు. 'మిత్రోన్...' అంటూ తన ప్రసంగాలను మొదలుపెట్టే ప్రధాని మోడీ... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని 'హుళక్కనిపించి' మిత్ర ద్రోహానికి ఒడిగట్టారు. అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు... బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజరు... 'తెలంగాణలో అధికారం లోకి వస్తే ఏటా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం...' అంటూ ఇటీవల బల్లగుద్ది మరీ చెప్పారు. తొమ్మిదేండ్ల నుంచి కేంద్రంలో అదే కమలం పార్టీ అధికారంలో ఉంది.. అలాంటప్పుడు ఖాళీలను ఎవరు భర్తీ చేయొద్దన్నారు..? ఎవరు ఉద్యోగాలివ్వొద్దని అన్నారు...? ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే దేశద్రోహులైపోవటం ఖాయం. అయినా మోడీ వాగ్దానమే గాలికి కొట్టుకుపోయినప్పుడు... బండి గారి హామీ గురించి మాట్లాడటం తెలివి తక్కువతనమే అవుతుంది.
ఇక రాష్ట్రాన్ని తొమ్మిదేండ్ల నుంచి ఏకధాటిగా ఏలుతున్న గులాబీ పార్టీ... గత అసెంబ్లీ (2018) ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి అనే కొంగొత్త ప్రామీస్ను తెరపైకి తెచ్చి ఓట్లేయించుకుంది. ఆ తర్వాత దాని గురించి పాత్రికేయులు గుచ్చి గుచ్చి అడిగినా ఏలికల వద్ద సరైన ఆన్సరే లేకపాయే! పైగా అడిగినా ప్రతీసారీ... 'రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై లెక్కలు తీస్తున్నాం...' అని ఒకసారి, 'నిరుద్యోగ భృతికి విధి విధానాలు రూపొందిస్తున్నాం...' అని మరోసారి చెప్పి చేతులు దులుపుకోవటం మినహా చేసిందేమీ లేదు. ఈ లోపు శాసనసభకు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో వెయ్యక వెయ్యక ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే అదికాస్తా టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల పేపర్లు లీకై... అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటి వరకూ భర్తీ చేశామని చెబుతున్న సుమారు లక్షా 40వేల కొలువుల్లో అన్నింటికి అన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసిన ఉద్యోగాలు కావనేది మనం గుర్తించాల్సిన అంశం.
ఈ రకంగా రాష్ట్రంలో కొలువుల భర్తీ అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఒక చికెన్ ముక్కలా.. మటన్ ముక్కలా మారింది. అవసరం, అవకాశం వచ్చిప్పుడు ఆ ముక్కల్ని నంజుకు తినటం, ఆ తర్వాత కూరలో కరివేపాకులా నిరుద్యోగుల్ని తీసి పారేయటం ఆయా పార్టీలకు షరా మామూలైంది. 'మనం నడిచే దారిలో ఒక గొయ్యి ఉంది. అక్కడి నుంచి వెళ్లే వారందరూ దాన్ని పూడుస్తామంటూ ఫోజులు కొడుతూ ఉంటారు. కానీ ఎవ్వరూ ఆ పని చేయరు. ఎందుకంటే... దాన్ని ఈ రోజు పూడిస్తే.. రేపు పూడుస్తామని చెప్పటానికి, ఆ రకంగా ఫోజులు కొట్టటానికి వారికి ఏమీ మిగలదు కాబట్టి...' సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి గతంలో చెప్పిన ఈ మాట అక్షర సత్యం. అందుకే 'నిరుద్యోగం' అనే పెద్ద గొయ్యి రాష్ట్రంలో ఉందనీ, దాన్ని పూడ్చాలనీ నేతలందరికీ తెలుసు. కానీ దాన్ని పూడిస్తే తర్వాతి ఎన్నికల్లో వారికి చెప్పుకోవటానికి ఏమీ మిగలదు. అందుకే 'ఆ గొయ్యి...' అలాగే ఉండాలని వారు కోరుకుంటారు. మరి దాన్ని పూడ్చాలంటే, పాలక పార్టీల మెడలు వంచి గొయ్యిని పూడ్చేలా చేయాలంటే ఎలాంటి పోరాటాలు నిర్వహించాలనేది తెలంగాణ యువతరం, ఇక్కడి నిరుద్యోగులే తేల్చుకోవాలి.