Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ ఐ.టి రంగంలో, సాంకేతికంగా తన ఆధిపత్యం
కొనసాగుతున్నందునే అమెరికా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి వాటిలో
తనకున్న పట్టు, డిజిటల్ వ్యవస్థల్లో అమెరికన్ కంపెనీలే
పైచేయిగా ఉండం తదితర కారణాలవల్ల అగ్రరాజ్యం ఆటలు
సాగుతున్నాయి. ఏమైనప్పటికీ తాజాగా వెల్లడైన గూఢచర్యంపై
అమెరికా బాధ్యతాయుతమైన రీతిలో వివరణ ఇవ్వాలి. ఐరాసకు
అతిథ్యమిచ్చే దేశంగా అమెరికా దాని బాధ్యతలను నెరవేర్చేందుకు
ఐరాస ఛార్టర్ ప్రకారం చేపట్టాల్సిన కొన్ని కచ్చితమైన చర్యలు
అమలు చేయాల్సిందే.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ పైన, ఇంకొందరు ఐరాస అధికారులపైన అమెరికా గూఢచర్యానికి పాల్పడడం దారుణం. విస్తుగొలిపే ఈ వాస్తవాన్ని ఇటీవల లీకైన పెంటగాన్ పత్రాలు వెల్లడించాయి. ప్రపంచంపై తన ఆర్థిక, రాజకీయ, సైనిక పెత్తనం కోసం నిరంతరం ప్రయత్నించే అమెరికా ఇటువంటి సిగ్గుమాలిన పనులకు దిగజారుతోంది. శత్రు దేశాల సంగతి అటుంచి తన మిత్ర దేశాల అధినేతలపై కూడా ఇటువంటి గూఢచర్యానికి పాల్పడుతోంది. స్వయంప్రకటిత ప్రపంచ పోలీసు మాదిరిగా వ్యవహరించే అమెరికా దూకుడుకు, దుశ్చర్యలకూ అడ్డుకట్ట వేయడం అవసరం. గూఢచర్యంపై ఐరాస తన ఆందోళనను అమెరికాకు లాంఛనంగా తెలియజేసింది. దౌత్యపరంగా అది ప్రాథమిక ప్రతిస్పందన. కానీ ప్రపంచ దేశాల ప్రతినిధిగా ఉన్న సంస్థ అధినేతపైన, దాని అధికారులపైనా నిఘా వేయడం ఆ సంస్థను అవమానించడం, దాని ప్రత్యేక ప్రతిపత్తిని ధిక్కరించడమే అవుతుంది. ఐరాస స్వతంత్రతకు, స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో అమెరికా వ్యవహరించడం ఎంత మాత్రం తగదు. ఐక్యరాజ్యసమితికి ఆతిథ్యమిస్తున్న దేశంగా అమెరికా ఇటువంటి చర్యలకు పాల్పడరాదు. ఈ సిగ్గుమాలిన చర్యపై అంతర్జాతీయ సమాజానికి వివరణ ఇవ్వడం అమెరికా కనీస బాధ్యత. అగ్రరాజ్యం ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ గురించీ ఉపన్యాసాలు ఉపదేశాలు చేస్తే కుదరదు. వివిధ ప్రభుత్వాలు, అంతర్జాతీయ సమాజం గట్టిగా ఒత్తిడి చేస్తేనే అమెరికా మెడలు వంచడం సాధ్యం.
ఐరాసపై అమెరికా గూఢచర్యానికి పాల్పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐరాస చీఫ్గా బాధ్యతలు నిర్వహించిన బాన్ కి మూన్ పైన, నాటి భద్రతా మండలిలోని నాలుగు దేశాల ప్రతినిధులతో సహా పలువురిపై నిఘా వేసిందని ది గార్డియన్ పత్రిక 2010 లోనే వార్తా కథనాలిచ్చింది. 2013లో లీకైన 'ప్రిజమ్' రహస్య పత్రాలు ఆ విషయాన్ని నిర్థారించాయి. కాబట్టి అమెరికాకు ఇటువంటి తప్పుడు పనులు చేయడం ఓ అలవాటని విదితమవు తోంది. ఏవైనా పత్రాలు లీకైతేనో పరిశోధనాత్మక జర్నలిస్టులు వెలికితీస్తేనో ఇలాంటి దుశ్చర్యల గురించి లోకానికి తెలుస్తోంది. అసలు వెల్లడి కాకుండా ఎన్ని దాగి ఉన్నాయో! ప్రపంచ దేశాల ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి, దాని అను బంధ సంస్థలూ వివిధ రంగాల్లో విశేష కషి చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల మొదలు అత్యంత వెనుకబడిన దేశాల వరకూ ఉన్న యావత్ ప్రపంచ ప్రజల విద్య, వైద్య, ఆరోగ్య, ఆహార అంశాలతోబాటు సాంస్కృతిక విషయాలపై కూడా పరిశీలన, అధ్యయనం చేయడమేగాక పరిష్కార మార్గాలనూ ఆయా సందర్భాల్లో సూచిస్తున్నాయి. ప్రపంచ సంస్థగా అది నిరపేక్ష వైఖరి అనుసరిస్తున్నా వెనుకబడిన దేశాలకు బాసటగా నిలవడం సహజం. అమెరికాకు ఇది కంటగింపుగా ఉంది. ఆ కారణంగానే ఐరాసకు, డబ్ల్యూహెచ్ఓ వంటి ఇతర సంస్థలకూ అమెరికా చెల్లించవలసిన నిధుల వాటా చెల్లించకపోవడం లేదా భారీగా కోతలు విధించడం జరుగుతోంది. ఇంకొన్ని జి-7 దేశాలు కూడా ఆ బాట పట్టడంతో ఐరాస, దాని అనుబంధ సంస్థల నిర్వహణకు, కార్యకలాపాలు సాగించడమూ కష్టతరమవుతోంది. ఆర్థిక దిగ్బంధనానికి తోడు నిఘా చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు.
ఇప్పటికీ ప్రపంచ ఐ.టి రంగంలో, సాంకేతికంగా తన ఆధిపత్యం కొనసాగుతున్నందునే అమెరికా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి వాటిలో తనకున్న పట్టు, డిజిటల్ వ్యవస్థల్లో అమెరికన్ కంపెనీలే పైచేయిగా ఉండం తదితర కారణాలవల్ల అగ్రరాజ్యం ఆటలు సాగుతున్నాయి. ఏమైనప్పటికీ తాజాగా వెల్లడైన గూఢచర్యంపై అమెరికా బాధ్యతాయుతమైన రీతిలో వివరణ ఇవ్వాలి. ఐరాసకు అతిథ్యమిచ్చే దేశంగా అమెరికా దాని బాధ్యతలను నెరవేర్చేందుకు ఐరాస ఛార్టర్ ప్రకారం చేపట్టాల్సిన కొన్ని కచ్చితమైన చర్యలు అమలు చేయాల్సిందే. ఆ మేరకు అంతర్జాతీయ సమాజం నుండి ఒత్తిడి పెంచాలి. అమెరికా దురహంకారానికి చెక్ పెట్టాలి.