Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్ కార్మిక్ ఫ్యాక్టరీ కార్మికులు తమ యజమానుల దాష్టీకానికి కుమిలి పోలేదు. తిరగబడ్డారు...వారి దోపిడీపై ఎగబడ్డారు... ఆ తర్వాత 8 గంటల పనిదినం సాధించుకున్నారు. ఎర్రజెండా ఆద్యులైనారు... ఆరాధ్యులైనారు...కార్మికోద్యమ వినీలాకాశంలో ధృవతారలైనారు. ఆ చికాగో కార్మికులు పరిచిన దారే ఆ తర్వాత ప్రపంచ కార్మికోద్యమ రాదారయ్యింది.
నాటి రుధిర ధారలు... అవిగవిగో... ఇంకా పచ్చిగానే ఉన్నాయి. లఖిమ్పూర్ఖేరిలో రైతుల జీవితాలను చిదిమేసిన కార్ల కాన్వాయి గీసిన రక్తపు చారలు... కనపడటం లేదా?! దేశాలేవైనా, పాలకులెవరైనా చికాగో యజమానుల నుండి 'బ్యాటన్' అందుకుని కష్టజీవులపై బుల్డోజర్లు తోలుతూనే ఉన్నారు. అయితే స్పార్టకస్ వారసులేం తక్కువ తిన్నారూ? నాటి విచ్చుకత్తులూ, పిడి బాకుల మధ్య పోటీలేదు. ఒకర్నొకరు చంపుకోవాల్సిన దుర్నీతి నేడు లేదు. కార్మికులు, వారిని చూసి రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తులవారు సంఘటితమవు తున్నారు. సంఘాలు స్థాపించుకుం టున్నారు. యంత్రాలు శత్రువులు కాదన్న విషయం 'లుడ్డైట్' అమరులకే అర్థమైంది. పని గంటలు తగ్గించుకుంటేనే చాలదన్న తెలివిడి ఎరుకలోకొచ్చిన తర్వాత పెట్టుబడి దోపిడీనే పెకలించాలన్న అవగాహన పెరుగుతోంది. 'ప్యారిస్ కమ్యూన్' వైఫల్యాలను స్వయంగా బేరీజు వేసుకున్న లెనిన్ రైతాంగాన్ని విప్లవంలో అంతర్భాగం చేశాడు. బలమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు. 1917లో సోవియట్ యూనియన్ ఉనికిలోకొచ్చింది. ప్రపంచ చరిత్రలో మొట్ట మొదటిసారి దోపిడీ రహిత సమాజాన్ని మానవాళి చవిచూసింది. ఆ తదుపరి, మూడవ వంతు భూమండలంలో అది అనుభవంలోకొచ్చింది.
అయితే నేడది గత చరిత్ర అయ్యింది. 1991 తర్వాత ఫ్రాన్సిస్ ఫుకయూమా వంటి వారు చరిత్ర అంతమయిందన్నారు. పెట్టుబడిదారీ విధానమే శాశ్వతమన్నారు. దోపిడీ చిరాయువన్నారు. ఆ దశాబ్దంలోనే ఆసియా టైగర్ల సంక్షోభం భళ్ళున బద్దలైంది. కొరియా చూడు, థాయిలాండ్ చూడు అంటూ నల్లముసుగేసి బయస్కోప్ పాటపాడిన పాలకులంతా తెల్లమొహమేశారు. దానివెంటే డాట్ కామ్ సంక్షోభం, హౌసింగ్ బుడగ సంక్షోభం ఉరికొచ్చి స్థిరపడిపోయి ఉన్నాయి. అమెరికాతో సహా అన్ని పాశ్చాత్య దేశాల్లో ''పెట్టుబడిదారీ విధానం నశించాల''నే నినాదాలు మిన్నంటుతున్నాయి. పెట్టుబడిదారీ విధానం ఉద్యోగాలివ్వ లేదని, కేవలం ఒక్క శాతం ప్రజల ఆదాయాల్నే పెంచుతోందని తమ అనుభవంలో తెలుసుకుంటున్నారు. అమెరికాలోని యువతలో 18-24 వయసున్న యువతలో 51శాతం సోషలిజమంటే ఇష్టపడుతున్నారు. నయా ఉదారవాదం ఇక ''డెడ్‌ఎండ్''కు చేరుకుందని అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ దాన్ని గట్టెక్కించేందుకు ప్రజల్ని చీలుస్తున్నారు. అయినా వీటిని అధిగమిస్తూ లాటిన్ అమెరికన్ దేశాల్లో అనేక ప్రత్యామ్నాయాలు వెల్లివిరుస్తున్నాయి.
మన దేశంలోనూ నయా ఉదారవాద విధానాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. కార్మిక హక్కుల్ని 'కోడ్లు' తినేశాయి. 8 గంటల పనిదినానికి వారసులుగా గర్వించేవారు 12గంటల పనిదినం సర్వ వ్యాపితమవు తున్నందుకు అప్రమత్తం కావాల్సి ఉంది. గత ఐదేండ్లలో ఫ్యాక్టరీలు, గనులు, ఇతర నిర్మాణాల్లో వేలాది మంది కార్మికులు చనిపోయారు. కళ్లు, కాళ్ళు, చేతులు పోయినవారి లెక్కే లేదు. కార్పొరేట్-హిందూత్వ శక్తులు ఎవరి పనిలో వారు నిమగమయ్యారు. కార్పొరేట్లను మేపే పనిలో మోడీ బృందముంటే, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో సంఫ్‌ు పరివారముంది. ప్రపంచ ఆకలి సూచీలో 107వ ర్యాంకుకు చేరినా అక్షయపాత్ర కథలు విని కడుపులు నింపుకోమని ఆరెస్సెస్ జోకొట్టేపనిలో ఉంది. 'తిండి లేదు. ఉపాధి లేదంటూ 'ఇహపర'మైన విషయాలపై ఆందోళనెందుకు? అయోధ్యలో రామ మందిరం చూడండి. తాము 'విముక్తి' చేయబోయే కాశీ, మథురలు చూడండి' అని చెపుతోంది.
మనుస్మృతి అమలుకు, బ్రహ్మణాధిక్య సమాజ నిర్మాణంలో సంఫ్‌ు పరివార్ నిమగమై ఉంది. మహిళలు, దళితులు, ఆదివాసీలపై దాడులు దేశమంతా జరుగుతున్నాయి. వాటినెదిరించ కుండా, కులవ్యవస్థ మూలాలను ప్రశ్నించకుండా. వర్గ ఐక్యత అసాధ్యం. వర్గ ఉద్యమ ప్రస్థానం కూడా అసాధ్యమే.
భారతదేశంలో ఇదే కీలక మేడే కర్తవ్యం!
- ఆర్.సుధాభాస్కర్