Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వచ్చే ప్రతినిధులకు మసిబారిన మన బాల్యం కనిపించకూడదనేగా మన వాళ్ళ హడావుడి. వీధి బాలలను పరిరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నామనే పేరుతో ఏ చీకటి గుహల్లోకో నెట్టేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పైగా కనిపించే వాస్తవాన్ని కనుమరుగు
చేసేందుకు ప్రత్యేక అధికారులను సైతం నియమించారు. మా దేశం
వెలిగిపోతోందని ప్రపంచ దేశాల ముందు గొప్పలు పోయేందుకు
సిద్ధమవుతున్నారు.
వీధి బాలలు దైన్యంగా కనబడకూడదు. పుట్‌పాత్‌లపైన, చిరిగిన బట్టలతో, ఎండిన డొక్కలతో, దుమ్ము ధూళితో, మురికి పట్టి మన కంటపడకూడదు. లేకుంటే ప్రపంచం ముందు మన పరువేం కావాలి. ఇప్పుడిదీ మన ఏలికల ఆలోచన! ఈఏడాది అంతర్జాతీయ బాలల హక్కుల కన్వెన్షన్ (జీ20 శిఖరాగ్ర సమావేశాలు) మన దేశంలో జరగబోతుంది. వెంటనే రోడ్లపై కనిపించే బాలలందరినీ తరలించమని ఆదేశాలు జారీ చేశారు. దానికోసం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మే 1 నుండి 31 వరకు దేశ వ్యాప్తంగా జిల్లాల్లో ఈ ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా చర్యలు చేపడుతూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే 'కేవలం దేశాన్ని సందర్శించనున్న జీ20 ప్రతినిధులకు మన దేశ బాలల వాస్తవ పరిస్థితి కంట పడకుండా దాచడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. వీధి బాలల అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన చర్యలు చేపట్టలేదు. వారికి పునరావాసం కల్పించేందుకు అవసరమైన సౌకర్యాలు ఎక్కడా లేవు' అంటున్నారు ప్రముఖ సమాజిక కార్యకర్త నిర్మల్ గోరానా.
నిజమే కదా! వచ్చే ప్రతినిధులకు మసిబారిన మన బాల్యం కనిపించకూడదనేగా మన వాళ్ళ హడావుడి. వీధి బాలలను పరిరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నామనే పేరుతో ఏ చీకటి గుహల్లోకో నెట్టేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పైగా కనిపించే వాస్తవాన్ని కనుమరుగు చేసేందుకు ప్రత్యేక అధికారులను సైతం నియమించారు. మా దేశం వెలిగిపోతోందని ప్రపంచ దేశాల ముందు గొప్పలు పోయేందుకు సిద్ధమవుతున్నారు.
ఇలా సమస్యలను దాచేయడం మన పాలకులకు కొత్తేమీ కాదు. గతంలో ట్రంప్ వస్తున్నాడని ఇలాగే హంగామా చేశారు మన ప్రధాని. ఆయన పర్యటించే ప్రాంతాల్లో యాచకులు కనబడకుండా వాళ్ళను ఎక్కడో దూరంగా పడేసి వచ్చారు. మనది సంపన్న దేశంగా చూపించేందుకు నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు వీధి బాలల వంతు. ప్రజల బాధలే తన బాధలని చెప్పుకునే ప్రధాని పరివారం చెయ్యాల్సిన పనులేనా ఇవి? తనేదో గొప్ప పనులు చేస్తుంటే ప్రతిపక్షాలు తిడుతున్నారని కన్నీరు కారుస్తున్నారు. వీధి బాలల కన్నీళ్ళు మాత్రం ఆయనకు కనబడవా? నిజానికి వీధి బాలలకు సురక్షితమైన ప్రదేశం ఏదైనా ఉందీ అంటే అది కేవలం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు మాత్రమే. నిర్మల్ గోరానా అన్నట్టు ప్రభుత్వ విద్యాసంస్థలను మన పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పేదలకు విద్యను అందని ద్రాక్షగా చేస్తున్న వీళ్ళు వీధి బాలల జీవితాలను ఎలా మారుస్తారో చెప్పాలి?
ఈ ఆపరేషన్‌కి అంతర్జాతీయ స్థాయిలో బాలల కోసం పని చేస్తున్న యునెసెఫ్ను దూరం పెట్టమన్నారు. అంటే వీరి చేతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో దీనివల్ల అర్థమవుతుంది. జీ20 దేశాల ప్రతినిధులు మన దేశంలోని బాలల దుస్థితిని చూసి ఎక్కడ ఛీ కొడతారో అని వారి భయం. అయితే ఇక్కడ జీర్ణించుకోలేని వాస్తవం ఏమిటంటే దేశంలో వీధి బాలల సంఖ్యపై ప్రభుత్వం వద్ద సరైన డేటా లేకపోవడం. ఒక్కో స్వచ్ఛంధ సంస్థ అంచనాలు ఒక్కో రకంగా ఉంటున్నాయి. రెయిన్బో హౌమ్స్ అనే ఎన్జీఓ ప్రకారం గత 20ఏండ్లుగా భారతదేశంలోని 10నగరాలైన ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్, కాన్పూర్, లక్నో, మొఘల్ సరారు, ముంబై, నాసిక్, పూణే, కోల్‌కతాల్లో కోటి ఎనభై లక్షల మంది వీధి బాలలున్నారు. ఈ నగరాల్లో నిర్వహించిన సెన్సస్ సర్వే 2,02,765 మంది పిల్లలను గుర్తించింది. ఇందులో ఢిల్లీ 81,235, మహారాష్ట్ర 52,535, ఉత్తరప్రదేశ్ 30,407, కోల్‌కతా 20,068గా సంఖ్యలు ఉన్నాయి. మరో సర్వే ప్రకారం ఒక్క మన హైదరాబాద్‌లోనే 50 నుండి 75 వేల మంది వీధి బాలలు ఉన్నట్టు తేలింది.
3-5 ఏండ్ల మధ్య వయసు వారిలో 58.1శాతం మందికి ప్రభుత్వ విద్య లేదు. 11-14 ఏండ్ల మధ్య పిల్లల్లో కేవలం 33శాతం మంది మాత్రమే ప్రాథమిక విద్య పొందుతున్నారు. మిగిలిన వారంతా కన్న వాళ్ళకు దూరంగా, దురలవాట్లకు అత్యంత దగ్గరగా మసులుతున్నారు. నేర ప్రపంచంలో పావులవుతున్నారు. లైంగిక వేధింపులకు గురవుతూ అసహాయంగా బతుకుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. ఇటువంటి దుస్థితిలో ఉన్న వీధి బాలల జీవితాలను బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కాదా? స్వచ్ఛంధ సంస్థలు చేస్తున్న పనిని మన దేశ పాలకులు ఎందుకు చేయలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. సమస్యలు పరిష్కరించలేని నేతలు దానిని దాచేయడానికి తెగ ఆరాట పడుతున్నారు. కష్టాల కొలిమిలో కాలిపోతున్న భావి భారతాన్ని చీకట్లో దాచి వెలుగుల దేశంగా చూపించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.
సత్యాలను, వాస్తవాలను కప్పిపుచ్చటమే ఈనాటి పాలకుల లక్షణంగా కనపబడుతున్నది. అయితే సత్యాలు బయటికి రాకమానవు. అబద్దాలు, దాచివేతలతో ఎంత కాలం కొనసాగుతారు. బాలల భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన వారు ఇలా కప్పిపుచ్చి తమ బాధ్యత నుండి తప్పుకోలేరు.