Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆపరేషన్ కావేరి బాధ్యత చూస్తున్న విదేశాంగశాఖ సహాయ మంత్రి, కేరళకు చెందిన వి.మురళీధరన్ సూడాన్‌లో మరణించిన మలయాళీ వ్యక్తి మృతదేహాన్ని కేరళకు రప్పించడంలో విఫలమయ్యారు. ఉక్రెయిన్‌లో భారతీయులను సకాలంలో సురక్షితంగా రక్షించడంలో దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకున్న మోడీ ప్రభుత్వం సూడాన్ లోనూ అదే తప్పు చేసింది. బాంబులు, తుపాకుల మధ్య ఆకలి దప్పులతో అలమటిస్తున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలి.
అంతర్యుద్ధంతో అగ్నిగుండంలా తయారైన సూడాన్‌లో చిక్కుకున్న వేలాదిమంది భారతీయులు అక్కడి నుంచి ఏవిధంగా బయటపడాలో తెలీక తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే కేరళకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇద్దరు మిలట్రీ నాయకుల మధ్య చర్చలు విఫలం కావడంతో రాజధాని ఖార్టూమ్ సహా ఆ దేశంలో రక్తం ఏరులై పారుతోంది. అమెరికా, ఐరోపా, గల్ఫ్ సహా అనేక దేశాలు నాలుగైదు రోజులుగా తమ దేశాల ప్రజల తరలింపు ప్రక్రియను చేపట్టాయి. ఎట్టకేలకు ప్రభుత్వం భారతీయుల తరలింపునకు చర్యలు చేపట్టింది. పోర్ట్ సూడాన్ నుంచి 278 మంది భారతీయుల తొలి బృందం బయల్దేరింది.
ఆర్మీ తిరుగుబాటుతో నాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్ బషీర్‌ను 2019లో సైన్యం గద్దెదింపి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. 2021లో ఆ ప్రభుత్వాన్ని అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, మహమ్మద్ హమ్దాన్ డాగలో (హెమడ్తీ) కలిసి కూల్చివేశారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించి, పౌర ప్రభుత్వాన్ని నెలకొల్పాలి. కానీ, బుర్హాన్ ఆ పనిచేయలేదు. హెమడ్తీ, పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్‌ఎఫ్‌సి)తో కలిసి బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా సంపద వెనకేసుకున్నారు. లక్షమంది సైన్యమున్న ఆర్ఎస్ఎఫ్ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామాలతో సైన్యం, ఆర్ఎస్ఎఫ్ మధ్య ఈ నెల 15 నుంచి కాల్పులు, ఘర్షణలు ప్రారంభమయ్యాయి. సూడాన్ ప్రజలు కోలుకోలేని సంక్షోభంలో చిక్కుకుని, రోడ్లన్నీ శవాల కుప్పలై, ఆహారం దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. లక్షల మంది సూడాన్ ప్రజలు దేశం విడిచి పారిపోయారు. ఇప్పటి వరకూ 459 మంది మరణించినట్లు, నాలుగు వేల మందికిపైగా తీవ్ర గాయపడినట్లు డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది.
అమెరికా, బ్రిటన్ తమ దౌత్యవేత్తలను, వారి కుటుంబాలను ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పొరుగుదేశమైన ఇథియోపియాకు సురక్షితంగా పంపించాయి. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వందలాదిమందిని రక్షించాయి. సౌదీ అరేబియా సముద్రమార్గంలో 150మందిని సురక్షితంగా జెడ్డాకు తీసుకొచ్చింది. అందులో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు కూడా సూడాన్ నుంచి తప్పించుకుని రాగలిగారు. ఫ్రాన్స్ మరో ఐదుగురు భారతీయులను రక్షించింది.
వాస్తవానికి సూడాన్‌తో భారత్‌కు చాలా మంచి సంబంధాలున్నాయి. సుదీర్ఘ అంతర్యుద్ధం అనంతరం 2011లో సూడాన్‌ను విభజించి దక్షిణ సూడాన్ దేశాన్ని ఏర్పాటు చేయడంలో మనదేశం ప్రధాన పాత్ర పోషించింది. ఆ దేశంతో 150ఏండ్లకుపైగా సంబంధాలున్నాయి. సూడాన్‌లో ఐదువేల మందికిపైగా భారతీయులు చిక్కుకున్నారని, వారిలో కేరళీయులే 300మందికిపైగా ఉన్నారని, వారిని రక్షించాలని ఈ నెల 21వ తేదీనే కేరళ సి.ఎం పినరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. అయినప్పటికీ, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంది. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో 'ఆపరేషన్ కావేరి' పేరుతో ఇప్పుడు హడావిడి చేస్తోంది.
మోడీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా మారిందంటూ నిత్యం ఊదరగొట్టే ప్రభుత్వం సూడాన్ లాంటి అతి చిన్న దేశంలో చిక్కుకున్న వారిని సకాలంలో రక్షించలేని దుస్థితిలో ఉంది. అమెరికా, యూరోపి యన్ దేశాలు, గల్ఫ్ దేశాలు మనకంటే ముందుండటం గమనార్హం. విదేశాంగమంత్రి జైశంకర్ న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, అమెరికా అధికారులతో చర్చలు జరిపినప్పటికీ కాల్పుల విరమణ లేదా భారతీయ పౌరుల భద్రత గురించి పట్టించుకోలేదు. ఆపరేషన్ కావేరి బాధ్యత చూస్తున్న విదేశాంగశాఖ సహాయ మంత్రి, కేరళకు చెందిన వి.మురళీధరన్ సూడాన్‌లో మరణించిన మలయాళీ వ్యక్తి మృతదేహాన్ని కేరళకు రప్పించడంలో విఫలమయ్యారు. ఉక్రెయిన్‌లో భారతీయులను సకాలంలో సురక్షితంగా రక్షించడంలో దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకున్న మోడీ ప్రభుత్వం సూడాన్ లోనూ అదే తప్పు చేసింది. బాంబులు, తుపాకుల మధ్య ఆకలి దప్పులతో అలమటిస్తున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్రం అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలి.