Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాతకు దగ్గులు నేర్పాననుకునే విశ్వగురు పాలనలో భారత ప్రతిష్టను 'దగ్గు మందులు' దిగజార్చాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. ఆరోగ్య రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించనుందంటూ ఒక వైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలు బాకా బజాయిస్తుంటే... మరోవైపు ''భారత్ ఫార్మా కంపెనీలో తయారైన దగ్గు మందులతో ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త...''అంటూ డబ్య్లూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేస్తున్నది. పశ్చిమాఫ్రికా దేశమైన గాంబియాలో దగ్గుమందు తాగి 66మంది పిల్లలు మత్యువాత పడ్డారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటనకు హర్యానాకు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారుచేసిన మందులే కారణమంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆ నాలుగు మందులను ప్రపంచ వ్యాప్తంగా నిషేధించింది.
మెయిడెన్ కంపెనీ సిరప్పులు గాంబియాకు మాత్రమే ఎగుమతి అయినట్టు ప్రస్తుతానికి తెలుస్తున్నప్పటికీ, మిగతాదేశాలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనని యావత్ ప్రపంచానికీ ఓ హెచ్చరిక కూడా చేసింది. దేశీయంగా వీటి వినియోగం లేనప్పటికీ, 'ఏ అందమైన అట్టపెట్టెల్లో ఏ విషం దాగి ఉందో' అని తల్లిదండ్రులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నాలుగుమందులను తయారుచేస్తున్న మెయిడెన్ కంపెనీపై ఇప్పటికే కేరళ, గుజరాత్ ప్రభుత్వాలు గత రెండేండ్లలలో నాసిరకం డయాబెటిస్ మందులు ఉత్పత్తి చేస్తుందని ఐదుసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసాయి. అయినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లే ఈరోజు ప్రపంచదేశాల ముందు మన దేశం తలవంచుకునే పరిస్థితి దాపురించింది. ఈ సంస్థ తన ఉత్పత్తులు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందాయనీ, జీఎంపి (గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్) సర్టిఫికేట్ ఉన్నదని చేసిన వాదనంతా బుకాయింపేనని రూఢ అయిపోయింది. ఈ సంస్థను తాము ఎన్నడూ సందర్శించిందే లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిగ్గుతేల్చేయడంతో మన నియంత్రణ వ్యవస్థల డొల్లతనం యావత్ ప్రపంచం ముందు తేటతెల్లం అయింది. ఇప్పటికైనా కేంద్రం సరైన రీతిలో స్పందించకుంటే మన దేశంలో డయాబెటిక్స్‌తో బాధపడే కొన్ని కోట్లమంది ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ఫిర్యాదులను కేంద్రమే కాదు, హర్యానా ప్రభుత్వం కూడా పెడచెవినే పెట్టింది. వరుస ఫిర్యాదులకు నెలవైన ఆ సంస్థమీద ప్రభుత్వాలు ఓ కన్నేసి ఉంటే, ఆ ఉత్పత్తుల నాణ్యత నిగ్గుతేలేది. అంతేకాదు స్వయం ప్రకటిత గుర్తింపులూ, హౌదాల బాగోతమూ బయటపడేది.
గాంబియాకు సరఫరాచేసిన మందుల నమూనాలు తీసుకున్నాం. పరీక్షకు పంపాం. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని హర్యానా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు బ్యాచ్‌లకు సంబంధించి సేకరించిన నమూనాల్లో, పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన రెండు రసాయనాల వాడకం మోతాదుకుమించి ఉన్నట్టు నిర్థారణైందని వార్తలు వస్తున్నాయి. ఎడతెరిపి లేని దగ్గు ప్రాణాలు తీస్తుందేమో అని తాగించిన మందే విషమై తన పిల్లల ప్రాణాలు తీసుకుంటుంటే ఆ తల్లిదండ్రులు చేష్టలుడిగి చూస్తూ ఉండటం ఎంత నరక యాతన! ఏ దేశమైనా అంతర్జాతీయంగా తన పరువు పోకూడదని కోరుకుంటుంది. మన ప్రభుత్వానికి అది కూడా ఉన్నట్టు లేదు. కనుకే, నాసిరకం ఉత్పత్తులు ఎగుమతి కాకుండా అడ్డకోలేదు. ఈ మందులు పోయేది చీకటి ఖండానికే కదా అన్న నిర్లక్ష్యమో లేక అంతకు మించిన లాభాపేక్షో తెలియదు కానీ, ఈ ఘటన భారత్‌ను అంతర్జాతీయ వేదికపై నగంగా నిలబెట్టింది. బాధ్యత వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వస్తున్న విమర్శ దున్నపోతుపై వానలా ఉంది తప్ప, తయారీలో పర్యవేక్షణా లేదు, ఎగుమతికి ముందు పరీక్షలూ లేవు. చివరకు దిగుమతి చేసుకున్న గాంబియాలోనూ అదే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యమే ఆ పసిపిల్లల ప్రాణాలను తీసింది. డై ఇథైలీన్ గ్లైకాల్, ఇథైలీన్ గ్లైకాల్ వినియోగం మీద ఎన్ని ఆంక్షలు, నియంత్రణలు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మొదట్లో హిమాచల్ ప్రదేశ్‌లో 13మంది మృతిచెందినప్పుడైనా కేంద్రం కళ్లు తెరిచి ఉంటే డబ్ల్యూహెచ్ఓ నిషేదం దాకా పరిస్థితి వచ్చేది కాదు. మందులు తయారు చేసి ప్రాణాలు కాపాడాల్సిన 'ఫార్మా' కంపెనీల కక్కుర్తే దేశానికి ఈ అప్రతిష్టను తెచ్చింది. భారతదేశంలో యాంటీబయాటిక్స్ వాడకం రానున్న రోజుల్లో మరో మహమ్మారిగా అవతరిస్తుందని మొన్ననే 'లాన్సెట్' ఒక నివేదిక తయారు చేసింది. ఫార్మా కంపెనీలు, డాక్టర్లను ఏరకంగా ప్రలోభపెడుతున్నాయో లాన్సెట్ బహిర్గతం చేసింది. చివరికి కోవిడ్ పుణ్యమా అని 'డోలో 650'ని నేడు పెద్ద ఎత్తున వినియోగంలోకి తేవడం మనం చూస్తున్నాం. ఫార్మా సామ్రాజ్యాన్ని ప్రభుత్వాలు కదిలించలేనంత బలంగా తయారైంది. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేట్‌ను ప్రోత్సహించిన ఫలితం ఇప్పుడందరూ అనుభవించాల్సి వస్తోంది. బ్రిక్స్ దేశాలలో ప్రజారోగ్యానికి అతి తక్కువ ఖర్చు పెడుతున్నది మన దేశమేనన్నది జగమెరిగిన సత్యం. ప్రజారోగ్య సంరక్షణ విషయంలో భారత్‌కు లభించిన 147వ స్థానం ''భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించడం'' అన్న విశ్వగురు వ్యాఖ్యలు వొట్టి మాటలేనని కొట్టిపారేస్తోంది.